ముందు ఇంటగెలిచి రచ్చ గెలవాలి
తెలంగాణ సమస్యలపై ముందు దృష్టి సారించాలి
హైదరాబాద్,నవంబర్19(జనంసాక్షి): గత పార్లమెంట్ ఎన్నికల ముందు జాతీయ రాజకీయాల గురించి సిఎం కెసిఆర్ చర్చ చేశారు. వివిద రాష్ట్రాల నేతలతో మాట్లాడారు. బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకరంగా ప్రత్యామ్నాయం సృష్టిస్తామని అన్నారు. అప్పట్లో హడావిడి చేసినా..మళ్లీ బిజెపి అధికారంలోకి రావడంతో ఆయన తన ప్రయత్నం విరమించుకున్నారు. నిజానికి సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాలపై స్పష్టత ఉంటే దానిని కొనసాగించేవారు. కానీ తాజాగా ఇప్పుడు దుబ్బాకలో ఓటమి తరవాత, గ్రేటర్ ఎన్నికల సమయంలో మాత్రమే మళ్లీ ప్రత్యామ్నాయ రాజకీయాలపై మాట్లాడుతున్నారు. ఓ రకంగా బిజెపితో లోపాయకారి ఒప్పంద సాగిస్తున్నారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఇకపోతే వివిధ అంశాలను వ్యతిరేకించాల్సి వచ్చినప్పుడు నిర్మొహమాటంగా ఎదిరించాలి. దానికి ఎజెండా అవసరం లేదు.కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై త్వరలోనే దేశవ్యాప్త నిరసనకు టీఆర్‌ఎస్ సిద్ధమైందని కెసిఆర్ ప్రకటించారు. డిసెంబర్ రెండోవారంలో జాతీయస్థాయిలోని ప్రతిపక్ష పార్టీలన్నింటితోకలిసి హైదరాబాద్ కేంద్రంగా ఒక సదస్సు నిర్వహించబోతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించారు. అయితే ఇవన్నీ ఇప్పుడే గుర్తించారా లేక గతంలోనే గుర్తించారా అన్నది కెసిఆర్ చెప్పాలి. గత ఎన్నికల ముందేఆయన ఈ సమస్యలను ప్రస్తావించారు. ఎందుకు దీనిపై ముందుకు సాగలేదన్నది ముఖ్యం. రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం అనుకుని ఉంటే దానిని కొనసాగించాల్సి ఉండేది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి ఆరున్నరేండ్లు గడిచినా దేశంలో జరిగిన అభివృద్ధి ఏవిూలేదని, పైగా దేశం ఇప్పుడు తిరోగమనంలో నడుస్తున్నదని కెసిఆర్ ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాక 23 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టారని, అద్భుత లాభాలను తెచ్చిపెట్టిన వీటిని విదేశీ కంపెనీలకు తెగనమ్ముతున్నారని విమర్శించారు. మోదీ ప్రధాని కావడంవల్ల దేశ ప్రజలకు ఒరిగిందేవిూలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిని ఇక ఉపేక్షించేది లేదని, అవసరమైతే కార్మికుల పక్షాన, దేశ ప్రజలు, రైతాంగంపక్షాన యుద్ధంచేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, నిష్కియ్రా పరత్వ విధానాలపై జాతీయస్థాయిలోని వివిధ పార్టీలతో మాట్లాడుతున్నామని, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్, కేరళ సీఎం పినరయి విజయన్, డీఎంకే నేత స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్, ఒడిశా అధికారపార్టీ బీజూ జనతాదళ్‌నేత పినాకిని శర్మ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, అకాళీదళ్‌నేత సుఖ్బీర్‌సింగ్ బాదల్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో ఇప్పటికే మాట్లాడామన్నారు.నిజానికి గతంలోనే సిఎం కెసిఆర్ సీరియస్‌గా యత్నించారు. మధ్యలో ఆయనే దీనిపై సైలెంట్ అయ్యారు. ఒకవేళ కేంద్ర విధానాలు దేశానికి హానికరంగా ఉంటే పోరాడాల్సిందే. అయితే అదే సమయంలో తెలంగాణ సమస్యలపై ముందు చర్చించాలి. ప్రజలు ఎదుర్కొటున్న అనేకానేక సమస్యల పైనా చర్చ చేయాలి. విపక్షాల ఆరోపణలను తేలికగా కొట్టి పారేయరాదు. కాంగ్రెస్ నిష్కియ్రాపరత్వ రాజకీయాల నేపథ్యంలో నరేంద్రమోదీ ప్రభుత్వం, బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇతర పక్షాలపై పడిందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా ఆ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెడుతున్నదంటున్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు సంఘీభావంగా ఉండి, పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యుద్ధం చేస్తామన్నారు. తెలంగాణలో సమస్యలపై ముందు యుద్దం చేసి వాటిని ఎదుర్కోవడం ద్వారా కెసిఆర్ కేంద్రానికి సందేశం ఇవ్వాలి. ఇక్కడ చేయగలి గామన్న సందేశం ప్రజలకు చెప్పాలి. ఇంటగెల్చి రచ్చగెలవాలి. దేశ రాజకీయాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక కొత్త ట్రెండ్ తెచ్చింది. ఒక అబద్‌ద్దాన్ని వందసార్లు చెప్పి ప్రజలను గోల్‌మాల్‌చేసే రాజకీయాలకు బీజేపీ కేరాఫ్‌గా మారింది. తాము ఏవిూ చేయకున్నా ఏదో చేసినట్టు సోషల్ విూడియాలో యాంటీసోషల్ ప్రచారం చేసుకోవడం బీజేపీకే చెల్లిందని కెసిఆర్ ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఎండగట్టడానికి సిద్దం కావాలి. ఇలాంటి విషయాల్లో ప్రజలను చైతన్యం చేయాలి. అప్పుడే ప్రజలు కూడా నమ్ముతారు.