కీలకం కానున్న ఎంఐఎం ఎత్తుగడలు
ఎంఐఎంతో తకట్టకుండా టిఆర్‌ఎస్‌కు చాన్స్ లేనట్లే
అదే జరిగితే బిజెపికి అస్త్రం దొరికినట్లే
హైదరాబాద్,డిసెంబర్5 (జనంసాక్షి) : మతతత్వ ఎంఐఎంతో అధికార టిఆర్‌ఎస్ కుమ్మక్కయ్యిందని ప్రచారం చేసిన బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్... ఇప్పుడు టిఆర్‌ఎస్ వ్యూహాలను గమనించే పనిలో పడ్డారు. నగర మేయర్ పీఠం దక్కించుకోవాలంటే టిఆర్‌ఎస్‌కు ఎంఐఎం సాయం తప్పనిసరి. ఒంటరిగా పీఠం దక్కించుకోవడం అసాధ్యం. ఎంఐఎంతో పొత్తు లేదన్న టిఆర్‌ఎస్ ఇప్పుడు దీనిని ఎలా సాధిస్తుందని బిజెపి చూస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీని ఎదుర్కోగలిగిన సమర్థ నాయకుడని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటన ఇప్పుడు గ్రేటర్ కోసం కలిసి పనిచేస్తుందన్న సంకేతాలు ఇస్తోంది. ఆయన సమర్థంగా పాలిస్తున్నారని, కొన్ని సీట్లు పోయినంత మాత్రాన రాజకీయంగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఓవైసీ వ్యాఖ్యానించారు. సీఎం దక్షిణ భారతదేశంలోనే భవిష్యత్తు ఉన్న నాయకుడని కూడా కొనియాడారు. కేసీఆర్‌ను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నానని చెప్పారు. ఇకపోతే బిజెపికి చెందిన కార్పోరేటర్లను లాక్కోవడం అంత ఈజీ కాదు. కాంగ్రెస్‌కు ఉన్న ఇద్దరు కార్పోరేటర్లను లాక్కున్నా లాభం లేదు. అనివార్యంగా ఎంఐఎంతో కలసి వెళ్లాల్సిందే. అయితే కెసిఆర్ వ్యూహమేమిటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాలు ఏ ఒక్క రాజకీయపార్టీకి పూర్తి మెజారిటీని అందించలేదు. హంగ్ పరిస్థితి ఏర్పడడంతో ఇప్పుడు అంతా తలలు పట్టుకుంటున్నారు. బిజెపి మాత్రం తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని తెలిపింది. ఈ దశలో టిఆర్‌ఎస్ ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం మజ్లిస్ సాయం తీసుకోవడమే. గతంలో నాలుగు స్థానాలు మాత్రమే ఉన్న భారతీయ జనతాపార్టీ ఈ సారి నలభై ఎనిమిది గెలుచుకుని టిఆర్‌ఎస్‌కు నిద్రలేకుండా చేసింది. నామమాత్రపు ఆధిక్యం కలిగి 56 డివిజన్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన తెలంగాణ రాష్ట్రసమితికి, ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకున్నా అధికారానికి దూరంగానే ఉండాల్సిన దుస్థితలో ఉంది. నలభై నాలుగు సీట్లతో బలంగా ఉన్న మజ్లిస్ మద్దతు తీసుకోవచ్చు కానీ అందులో అనేక సమస్యలున్నాయి. మేయర్ ఎన్నిక కోసం జరగవలసి వచ్చే విన్యాసాలు, తెరవెనుక తెర ముందు కుదరవలసిన అవగాహనలు- రానున్న రోజులలో ఆసక్తికరమైన సన్నివేశంగా పరిణమించనున్నాయి. స్పష్టంగా చెప్పుకోవాలంటే, ఇది తెలంగాణ రాష్ట్రసమితి ఆధిపత్యానికి గండిలా భావించాలి. ఏదో రకంగా సాంకేతికంగా మేయర్ పీఠాన్ని పొందవచ్చును కానీ, వాస్తవంలో మాత్రం ఆ పార్టీ అనుభవంలో ఉన్న సంపూర్ణ అధికారం ఇప్పుడు జారిపోయిందనే చెపపుకోవాలి. ప్రభుత్వం పనితీరు విూద కావచ్చు, ప్రభుత్వాధినేత వైఖరుల విూద కావచ్చు హైదరాబాద్ ప్రజలకు తీవ్రమైన ఆగ్రహం కలిగింది. దాన్ని వ్యక్తం చేయడానికి ఒక అవకాశం లభించింది. ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడానికి ఒక రాజకీయపక్షమూ కనిపించింది. దాని పర్యవసానమే ఈ ఫలితం. ఇది కేవలం భారతీయ జనతాపార్టీకి సానుకూల ఓటు కాదని టిఆర్‌ఎస్‌కూ తెలుసు. బిజెపికి ముందునుంచీ నగరంలో గట్టి పునాది ఉన్నది. కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. కానీ, నగరమంతా విస్తరించిన నిలకడైన ప్రజాబలం లేదు. తెలంగాణ ఏర్‌ప్డ తరవాత బిజెపి సానుభూతిపరులు కూడా టిఆర్‌ఎస్‌కు దగ్గరయ్యారు. బిజెపికి ఉన్న పరిమిత బలానికి, ఆ పార్టీ పరిశ్రమ, ప్రభుత్వ వ్యతిరేకత తోడయింది. మళ్లీ కార్యకర్తలు బండి రాకతో వెంట నడిచారు. ఈ ఫలితం బిజెపికి బల్దియా కుర్చీని ఇవ్వలేకపోయినా పునాది వేశాయి. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు దీవించారు. అలాగే ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేశారు. మధ్య
తరగతి వారు నివసించే ప్రాంతాలు, తెలంగాణ జిల్లాల నుంచి స్థిరపడినవారి నివాసప్రాంతాలలో భారతీయ జనతాపార్టీకి బాగా ఆదరణ లభించింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు- ప్రభుత్వం విూద కోపంగా ఉన్నట్టు, బిజెపిని వారు ప్రత్యామ్నాయంగా చూసినట్టు ప్రాథమిక విశ్లేషణలు సూచిస్తున్నాయి. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో లేని నాయకుడి విూద క్రమంగా విముఖత ఏర్పడుతుంది. నేరుగా విమర్శించడానికి ఆస్కారం లేని నిర్బంధ వాతావరణంలో ప్రజలు విధేయులుగానే కనిపిస్తారు. అవకాశం దొరికినప్పుడు మాత్రం గట్టి దెబ్బ తీస్తారు. బహుశా ఇప్పుడు అదే జరిగిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఏదేమైనా నగరపాలక మేయర్ పీఠం రాజకీయాలు ఎటు తిరగుతాయన్నది ఆసక్తిగా మారింది.
ఆసక్తిగా మారిన మేయర్ సీటు మలుపులు