తెలంగాణలోనూ గ్రాండ్‌ సక్సెస్‌

 


- ఆందోళనలకు దిగిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు

- పలుచోట్ల నిరసనలు, బైక్‌ ర్యాలీలు, దిష్టిబొమ్మ దహనాలు

- బూర్గుల టోల్‌గేట్‌ వద్ద ఆందోళనలో పాల్గొన్న కెటిఆర్‌

- వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పిలుపు

హైదరాబాద్‌,డిసెంబరు 8 (జనంసాక్షి): కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బారత్‌ బంద్‌కు మద్దతు ఇచ్చిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఆందోళనలకు దిగింది. రైతులు తలపెట్టిన భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి మద్దతిచ్చింది. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు రైతులకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, రైతులు ఆందోళనలకు దిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టణ కేంద్రాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. ప్రధాన కూడళ్లలో రాస్తారోకోలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. రైతులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ర్యాలీలు నిర్వహించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దుకాణ సముదాయాలు కూడా తెరుచుకోలేదు. అన్ని రంగాల వారు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. దీంతో అనేక చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతుల తరపున దీర్ఘకాలికంగా పోరాడేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తేల్చిచెప్పారు. రైతులకు ఎవరు ద్రోహం చేసినా టీఆర్‌ఎస్‌ ఎండగడుతుందని స్పష్టం చేశారు. షాద్‌నగర్‌ బూర్గుల టోల్‌గేట్‌ వద్ద రైతులకు మద్దతుగా కేటీఆర్‌, కెకె, శ్రీనివాసగౌడ్‌, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు భారత్‌ బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కడుపు మండిన రైతన్నలు గత 13 రోజులుగా ఢిల్లీ పురవీధుల్లో, ఎముకలు కొరికే చలిలో, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. ఈ దేశానికి న్నం పెట్టే రైతు బాగుంటేనే మనమంతా బాగుటుంది. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుండదు.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు.. కానీ దేశ వ్యాప్తంగా రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. రైతన్న ఏడ్వడం ఈ దేశానికి, ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తుల వైపే మొగ్గు చూపుతుంది. కానీ కర్షకుల వైపు మొగ్గు చూపకుండా.. వారి నెత్తిపై మూడు నల్లచట్టాలను రుద్దుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని అర్థమందని కెటిఆర్‌ అన్నారు. మార్కెట్‌ కమిటీలను రద్దు చేస్తామనడం సరికాదు. దేశంలో 85 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఈ చిన్న, సన్నకారు రైతులు కార్పొరేట్‌ శక్తులతో పోరాడలేరు. ఈ బిల్లుల వల్ల రైతులకే నష్టం కాదు.. మధ్యతరగతి ప్రజల నడ్డి కూడా విరుస్తుందని దుయ్యబట్టారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సున్నం పెడుతున్న వైనాన్ని ఈ దేశ ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల కోసం అందరం అండగా నిలవాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ రైతుల పక్షాన పోరాడుతోందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు సంఘీభావం తెలపాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు. పార్లమెంట్‌లో మందబలంలో సాగు బిల్లులను ఆమోదింప జేసుకున్నారు. సాగు బిల్లులకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌లో పోరాడిందని గుర్తు చేశారు. కొత్త సాగు బిల్లులకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు ఓటేసిందన్నారు. కనీస మద్దతు ధర విషయంలో కేంద్రం హావిూ ఇవ్వలేకపోయింది. కార్పొరేట్‌ శక్తులు కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్‌ను శాసిస్తాయి. రైతుబంధు,

రైతుబీమా పథకాల ద్వారా రైతులను కేసీఆర్‌ ఆదుకుంటున్నారని తెలిపారు. వ్యవసాయం విషయంలో రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందన్నారు. సన్న రకాలకు మద్దతు ధర ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కానీ సన్నరకాలకు మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం అడ్డం పడుతోందని కేటీఆర్‌ మండిపడ్డారు. టోల్‌గేట్‌ వద్ద ధర్నాతో వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కిలోవిూటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.