- పోలీస్ ప్రమోషన్‌లపై హైకోర్టును ఆశ్రయించిన 1996 బ్యాచ్ సీఐలు
- నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆంద్ర, తెలంగాణ డీజీపీలకు నోటిసులు
- తమ కంటే జూనియర్ లు తమకు బాస్ లుగా వస్తున్నారని వరంగల్ జోన్ అధికారుల ఆవేదన
హైదరాబాద్,జనవరి 25(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్‌లలో ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతం చేసి నెలాఖరులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించడంతో పోలీస్ శాఖలో కూడా ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతం అయింది. ఈమేరకు 1995 వరంగల్ జోన్ సిఐ లకు ప్రమోషన్లు ఇచ్చేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. 1995 వరంగల్ వారికి ప్రమోషన్లు ఇచ్చే సాకుతో, వారితో పాటుగా 1996,1998 హైద్రాబాద్ సిటీ అధికారులకు కూడా పోలీస్ ఉన్నతాధికారులు డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు తెర లేపడంతో మళ్ళీ పోలీస్ శాఖలో దుమారం రేగుతోంది. 1996, 1998, 1999 హైద్రాబాద్ సిటీ సిఐ లకు ప్రమోషన్లు ఇస్తూ ,1996 వరంగల్ జోన్ వారికి ఇవ్వకపోవడంతో, వారికి తమ బ్యాచ్ మరియు తమకంటే మూడేళ్ళు జూనియర్ల కింద పని చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇట్టి ప్రమోషన్లకు ఆధారమైన జిఒ 153 ను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ తప్పుల తడకగా తయారు చేసిందని చెప్పిన తెలంగాణ పోలీస్ శాఖ మళ్ళీ అదే జీఓ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలని అందుకు అనుగుణంగా ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతం చేయడం విమర్శలకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో జీఓ 153 సవరించే వరకు తమ కంటే జూనియర్లు అయిన హైద్రాబాద్ సిటి వారికి ప్రమోషన్లు ఇవ్వకూడదని 1996 వరంగల్ జోన్ అధికారులు వారం రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు గాను పూర్తి విషయాలను పరిగణలోకి తీసుకున్న కోర్ట్ రెండు రాష్ట్రాల డీజీపీ లకు ప్రమోషన్లకు చెందిన పూర్తి వివరాల్ని నాలుగు వారాలలో సంసమర్పించాలని నోటీసులు జారీ చేసినది. దీనితో 1995 వరంగల్ జోన్ వారి ప్రమోషన్ల ప్రక్రియపై మళ్లీ అవరోధాలు కల్పించారని 1996 వరంగల్ జోన్ వారిపై అసహనంతో ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలోనే అందరి కంటే ముందు ప్రమోషన్ లిస్ట్ లో ఉన్న 1995 వరంగల్ జోన్ వారికి మాత్రమే ప్రమోషన్లు ఇవ్వాలని 1996 వరంగల్ అధికారులు కోరుతున్నారు. కానీ వారికి ప్రమోషన్ ఇచ్చే సాకుతో తమ బ్యాచ్ మరియు తమకంటే జూనియర్ లు అయిన 1996, 1998, 1999 హైద్రాబాద్ వారికి ప్రమోషన్లు ఇచినట్లయితే, డిఎస్పీ స్థాయి అధికారి రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేసే అవకాశమున్నందున వారు తమకు బాస్‌లుగా వస్తే తమ కంటే జూనియర్లకు ప్రతి రోజు సెల్యూట్ చేస్తూ, వాళ్ల కింద ఎలా పని చేయాలని 1996 వరంగల్ అధికారులు అంటున్నారు.వాస్తవానికి వరంగల్ రేంజ్ కు సంబంధించిన 1995, 1996 బ్యాచ్ సీఐలకు, డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ను సంవత్సరం క్రితం కలిసి గోడు వెళ్ళ బోసుకొని, తమ కంటే జూనియర్ అధికారులు ముందుగా ప్రమోషన్లు తీసుకొని, తమకు బాసులుగా రావడం వల్ల వృత్తిపర ఇబ్బందులు ఎదుర్కుంటామని, తమ ఆత్మగౌరవం దెబ్బతింటుందని తెలిపారు. దానిపై స్పందించిన సీఎం కెసిఆర్ ఇక ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని, పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ బ్యాచ్ ల ప్రకారం ఇచ్చే విధంగా ఖచ్చితమైన సూచనలు ఇస్తామని తెలిపారు.కానీ ఆశ్చర్యకరంగా ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము తప్పుల తడకగా తయారుచేసిన 153 జీవో ప్రకారమే హైదరాబాదు సిటీ కు చెందిన 1996, 1998, 1999 మరియు 2000 సంవత్సరం కు చెందిన అధికారులకు ప్రమోషన్స్ ఇవ్వటానికి తెలంగాణ పోలీస్ శాఖ సమాయత్తం కావటం,తద్వారా వారిని తమకంటే సీనియర్లు అయిన 1996 వరంగల్ రేంజ్ వారికి బాస్‌లుగా పంపే ప్రయత్నం జరుగుతుంది. ఏ అన్యాయాన్నైతే వరంగల్ అధికారులు ముఖ్యమంత్రి కెసిఆర్ కు మొర పెట్టుకున్న అనంతరం బ్యాచ్ ప్రకారం ప్రమోషన్ ఇస్తామని హావిూ పొందారో, తిరిగి అదే అన్యాయాన్ని పునరావృతం చేయడం ద్వారా 1996 వరంగల్ వారికి తీవ్ర నష్టం జరుగ బోతుంది.నిజానికి గతంలో ఒక సిఐ స్థాయి అధికారి తన ప్రమోషన్‌పై కోర్ట్ కు వెళ్లగా, జీఓ 153 ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా తయారు చేసిందని స్వయంగా, తెలంగాణ పోలీస్ శాఖ తీవ్రంగా వ్యతిరేకించి, తమకు అన్యాయం జరిగే విధంగా ఈ జీవో ఉందని, తమతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా, తాము పంపిన ప్రతిపాదనలు తారుమారు చేసి, ఈ 153 జీవో ను ఏకపక్షంగా తయారు చేశారని తీవ్ర అభ్యంతరం తెలియచేసింది. ఆ జీవోను అమలు చేయలేమని ఆంధ్ర ప్రభుత్వానికి తెలియజేసిన తెలంగాణ ప్రభుత్వం అదే జీవోను తిరిగి తెరపైకి తీసుకురావటం, దాని ప్రకారం ఈ రోజు తిరిగి ప్రమోషన్స్ ఇవ్వటానికి సమాయత్తం కావటం ద్వారా వరంగల్ ప్రాంతానికి చెందిన 1996 బ్యాచ్ అధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇక తాము సిఐ లు గానే రిటైర్ అయ్యే పరిస్థితి కలుగుతుందని అంటున్నారు. అంతేకాక తెలంగాణలోని ఒక ప్రాంతంలోని జూనియర్ అధికారులకు ప్రమోషన్ ఇచ్చి, వేరే ప్రాంతంలోని సీనియర్ అధికారులకు ప్రమోషన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వలన, సీనియర్ అధికారులకు తమ కంటే జూనియర్లు అయిన వారి కింద పనిచేసే దుస్థితి ఏర్పడి పోలీసు శాఖలో అంతర్గత విభేదాలు పెరిగి, శాంతి భద్రతల పరిరక్షణలో అంకితభావం కొరవడే అవకాశాలు కలుగుతాయని అంటున్నారు.గతంలో వరంగల్ జోన్ వారికి నక్సల్స్ సమస్య దృష్ట్యా 4, 5 సంవత్సరాలు ప్రమోషన్‌లు ఇవ్వకుండా ఆపివేసి, మిగతా జోన్లలో మాత్రం ఎప్పటి కప్పుడు ప్రమోషన్లు ఇవ్వటం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడిందని, అందుకు తమకు అన్యాయం చేయవద్దని 1996 వరంగల్ అధికారులు కోరుతున్నారు. పోలీస్ శాఖలో బ్యాచ్ వారి ప్రమోషన్స్ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ఇచ్చిన హావిూ నెరవేరే విధంగా సంబంధిత అధికారులకు సూచనలు చేయాలని కోరుతున్నారు.