- చర్చలే జరగలేదు:రైతుసంఘాలు
- అసంపూర్తిగా ముగిసాయి:సర్కారు
దిల్లీ,జనవరి 22(జనంసాక్షి): వ్యవసాయ చట్టాలపై రైతులతో కేంద్రం చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్ శుక్రవారం జరిపిన 11వ విడత చర్చల్లోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తదుపరి చర్చలకు సంబంధించి తేదీ ఖరారు చేయకుండానే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ సమావేశంలో రైతుల వ్యవహార శైలిపై కేంద్రమంత్రులు అసంతృప్తి వ్యక్తంచేశారు. చట్టంలో లోపం లేకపోయినా ప్రతిపాదనలు చేశామన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్.. 18 నెలల పాటు ఈ చట్టాలను ప్రతిష్టంబింపజేసే ప్రతిపాదనను మించింది ఏదీ తమవద్ద లేదన్నారు. దీనిపై రైతులు నిర్ణయం తీసుకోలేదన్నారు. 'బంతి విూ కోర్టులోనే ఉంది.. కేంద్రం ప్రతిపాదనలపై విూ నిర్ణయం చెబితే మళ్లీ చర్చించేందుకు సిద్ధం' అని రైతుల వద్ద పునరుద్ఘాటించినట్టు సమాచారం. అనంతరం తోమర్ విూడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నేతలు చర్చలు జరపకపోవడం బాధాకరమన్నారు. గత సమావేశంలో కేంద్ర ప్రభుత్వ చేసిన ప్రతిపాదనలను దేశం, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పునఃపరిశీలించాలని కోరామన్నారు. ఈ మూడు చట్టాల రద్దు మినహా మరే ప్రతిపాదనతోనైనా రావాలని రైతు నేతలను కోరినట్టు తెలిపారు. కేంద్రం ఇచ్చిన ఆఫర్ కంటే మెరుగైన ప్రతిపాదనతో వస్తే చర్చించేందుకు తాము సిద్ధమేనని స్పష్టంచేశారు.
'బంతి విూ కోర్టులోనే ఉంది': రైతులతో తోమర్
మరోవైపు, 10 నిమిషాల కన్నా మించి చర్చలు జరగలేదని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. తదుపరి చర్చలు కొనసాగుతాయని కూడా తాము అనుకోవడం లేదన్నారు. తాము మాత్రం ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు.ఈ రోజు తొలి రౌండ్‌లో పది నిమిషాల కన్నా మించి చర్చలు సాగలేదన్నారు. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత మళ్లీ కేంద్రమంత్రులు వచ్చి ఇంతకన్నా మంచి ప్రతిపాదనలు చేయలేమని చెప్పారని, మాట్లాడుకొని వచ్చి చెబితే తదుపరి సమావేశానికి తేదీ ఖరారు చేస్తామని చెప్పారన్నారు. రిపబ్లిక్ డే రోజున తలపెట్టిన పరేడ్ కోసం పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఆ రోజు శాంతియుతంగా పరేడ్ నిర్వహిస్తామన్నారు. జనవరి 26తర్వాత ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే అంశంపై సమావేశమై చర్చిస్తామన్నారు.