గుజరాత్‌లో నవశకం - కేజ్రీవాల్‌

 


దిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి): గుజరాత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంపై ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడితో గుజరాత్‌ రాజకీయాల్లో నూతన ఒరవడి ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సూరత్‌లో తమ పార్టీని విశేషంగా ఆదరించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేజ్రీవాల్‌ బుధవారం ఓ సమావేశంలో వెల్లడించారు. 'గుజరాత్‌ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ సాధించిన విజయం రాష్ట్ర రాజకీయాల్లో నూతన ఒరవడికి నాంది. మేం గెలిచిన చోట నిజాయతీతో కూడిన రాజకీయాలు అందిస్తాం. మంచి విద్యాలయాలు, ఆస్పత్రులు, విద్యుత్‌ సౌకర్యాలు అందించే దిశగా రాజకీయాలు మొదలవుతాయి. గుజరాత్‌ అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తాం' అని కేజ్రీవాల్‌ తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల్లో గెలిచిన తమ అభ్యర్థులు ఎలాంటి పక్షపాతం లేకుండా తమ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. కాగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఫిబ్రవరి 26న సూరత్‌ పర్యటనకు వెళ్లనున్నారు. గుజరాత్‌లో ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఆదివారం ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అన్ని కార్పొరేషన్లను అధికార భాజపా క్లీన్‌స్వీప్‌ చేసింది. కానీ అనూహ్యంగా సూరత్‌ కార్పొరేషన్‌లో ఆప్‌ 27 స్థానాల్లో విజయం సాధించి.. ప్రధాన ప్రతిపక్ష ¬దా సాధించింది.