పేదల కోసం జనఔషధీ ప్రధాని మోదీదిల్లీ 07 మార్చి (జనంసాక్షి):

 దేశవ్యాప్తంగా 10వేల జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఏడాదికి రూ.3,600 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. జనౌషధి దినోత్స వం సందర్భంగా ఆదివారం షిల్లాంగ్‌లో 7500వ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. అనంతరం మోదీ జనౌషధి వినియోగదారులతో సంభాషించారు. '2014కు ముందు మనకు వంద కన్నా తక్కువ జనౌషధి కేంద్రాలుండేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్యను పదివేలకు చేర్చడమే కాకుండా, వినియోగదారుల సంఖ్యను కూడా రెట్టింపు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోజు షిల్లాంగ్‌ 7500వ జనౌషధి కేంద్రాన్ని ప్రారంభించాం. దీన్ని బట్టి ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్య కేంద్రాలు ఎలా విస్తరిస్తున్నాయో మనకు తెలుస్తోంది. ఈ జనౌషధి పథకం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు గిరిజన ప్రాంత ప్రజలకూ తక్కువ ఖర్చులో ఔషధాలు అందుతున్నాయి. అంతేకాకుండా యువతకు ఉపాధి కూడా లభిస్తోంది. ఈ కేంద్రాల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. బాలికలకు కేవలం రూ.2.5లకే శానిటరీ న్యాప్‌కిన్స్‌ లభిస్తున్నాయి' అని మోదీ వెల్లడించారు.  కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభావవంతమైన చికిత్స అందించడంలో భాగంగా మౌలిక సౌకర్యాల వృద్ధికి దృష్టి సారించిందని చెప్పారు. ఈ పథకం ద్వారా జనౌషధి కేంద్రాలను నిర్వహించే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచేందుకు కేంద్రం కృషి చేస్తోందని మోదీ తెలిపారు.