మల్లారెడ్డి విమర్శలపై కాంగ్రెస్‌ ఎదురుదాడి


 ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని సవాల్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరిన మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్‌ నేతలు మూకుమ్మడి ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ సమస్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడితే మంత్రి మల్లారెడ్డి జీర్ణించుకోవడం లేదని కాంగ్రెస్‌ నేత మల్లు రవి అన్నారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ మంత్రిగా ఉండి ఇష్టానుసారం రేవంత్‌పై బూతులు మాట్లాడటం సరైందేనా? అని ప్రశ్నించారు. మల్లారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. మల్లారెడ్డి రాజ్యాంగేతర శక్తిలాగా ప్రవర్తిస్తున్నారని, ఆయన మంత్రి పదవికి అనర్హుడని మల్లురవి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాకు ప్రజాదరణ పెరుగుతోందన్నారు. మూడుచింతలపల్లిలో దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, దళితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కూడా ఇవ్వలేదని మల్లు రవి విమర్శించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయ్యాక ప్రగతిభవన్‌ పునాదులు కదులుతున్నాయని, అందుకే మంత్రులు, ఎమ్మేల్యేలు రేవంత్‌పై విమర్శలకు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత అయోధ్య రెడ్డి అన్నారు. మల్లారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. విచారణతో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. మల్లారెడ్డి ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని అయోధ్యరెడ్డి హెచ్చరించారు.