సండే..గ్రేట్‌ ఫండే..`

 


హుస్సేన్‌సాగర్‌ ట్యాంక్‌బండ్‌ అందాల వీక్షణకు భారీగా తరలివచ్చిన సందర్శకులు

 హైదరాబాద్‌,సెప్టెంబరు 26(జనంసాక్షి): హుస్సేన్‌సాగర్‌ ట్యాంక్‌బండ్‌ అందాల వీక్షణకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సన్‌డే`ఫన్‌డే కార్యక్రమానికి నగర వాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈవారం ప్రత్యేకంగా రైల్వే రక్షకదళం ఆవిర్భావ దినోత్సవాన్ని ట్యాంక్‌ బండ్‌ వేదికగా నిర్వహించారు. ఈసందర్భంగా రైల్వే రక్షణ సిబ్బంది బ్యాండ్‌ షోతో సందర్శకులను అలరించారు. వివిధ రకాల ఫుడ్‌ స్టాల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచే ట్యాంక్‌ బండ్‌పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ట్యాంక్‌బండ్‌పై ఇంకో రెండుగంటల పాటు ఉండేందుకు అనుమతించాలంటూ ప్రభుత్వానికి వినతులు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం సాయంత్రం వాహనాల రాకపోకలను అనుమతించకపోవడంతో లోయర్‌ట్యాంక్‌ బండ్‌, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లవైపు ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరిగాయి. ట్యాంక్‌బండ్‌ విూదుగా రాకపోకలు కొనసాగించే వాహనదారులు, సిటీబస్సులు, అంతర్రాష్ట్ర బస్సులు, సరకు రవాణా వాహనాలు, ఆటోలు ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, లోయర్‌ట్యాంక్‌, లిబర్టీ క్రాస్‌రోడ్లను ఎంచుకున్నాయి. దీంతో అటువైపు వెళ్లే వాహనాలతో ఇవి కలిసిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. గమనించిన ట్రాఫిక్‌ అధికారులు జిల్లాల ఆర్టీసీ బస్సులను గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్‌ విూదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నారాయణగూడ, కోఠీ వైపు పంపుతున్నారు. ఆదివారం ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయన్న విషయం తెలియని ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు నేరుగా ట్యాంక్‌బండ్‌ వైపు వస్తే తెలుగుతల్లి ఫ్లైవోవర్‌ విూదుగా పంపుతున్నారు.