కుల రాజకీయాలకు పాతరేయాలి

ఓట్ల అభ్యర్థనలో కుల ప్రస్తావన లేకుండా చేయాలి

గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పు మేరకు ఇసి కన్నేయాలి
హుజూరాబాద్‌లో కుల,వర్గ ప్రాతిపదికగా సాగుతున్న ప్రచారం
హైదరాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో పాటు, కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల కావడంతో రాజకీయ వేడి ఊపందుకోనుంది. ఇప్పటికే హుజూరాబాద్‌లో ఎన్నికల రణరంగం సాగుతోంది. బద్వేల్‌లో కూడా ఇక పార్టీల పరంగా రాజకీయం వేడి అందుకోనుంది. అయితే ఎన్నికల్లో ప్రచారాల తీరు మారింది. కులాలు మతాలు ఆధారంగా విభజించి ఓట్లు దండుకునే కొత్త తరహా వ్యవహారం గత కొంతకాలంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇదే వైఖరి కనిపిస్తోంది. ఎన్నిక ఏదైనా, ప్రాంతం ఏదైనా ఇప్పుడు కులాల వారీగా విభజించి ఓట్లను దండుకోవడం అలవాటుగా మారింది. దేశాన్ని కులమతాలకు అతీతంగా అభివృద్ది చేసే క్రమంలో రాజకీయ పార్టీలు పూర్తిగా విఫలం అయ్యాయని అనడంలో సందేహం లేదు. ఎంతసేపు ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప మరో కోణంలో పార్టీలు ఆలోచిం చడం లేదు. నిబద్ద రాజకీయాలు మంటగలిశాయి. ఇందుకు బిజెపి కూడా మినహాయింపు కాదు. హుజూరాబాద్‌లో మాజీమంత్రి ఈటెలను ఓడిరచేందుకు తమ ముందున్న అన్ని అవకాశాలను అధికార
టిఆర్‌ఎస్‌ ఉపయోగించుకుంటోంది. ఇందుకు కులాల వారీగా సమావేశాలు పెట్టి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
కులవ్యవస్థను పెంచి పోషించారని మన పూర్వీకులను తిట్టిపోస్తున్న కమ్యూనిస్టులు సైతం కుల ఆధార రాజకీయాలనే నెరుపుతున్నారు. కులాల వారీగా వరాలిచ్చి ఓట్లను కొల్లగొడుతున్నారు. ఈ దేశంలో ఉన్నది పేదలు, నిరుపేదలు, ధనవంతులు అన్న కోణంలో కార్యక్రమాలు రూపొందండం లేదు. ఈ రకంగా పార్టీలు తమ ఎన్నికల ప్రణాళిలకలను రూపొందించుకోవడం లేదు. యూపి,బీహార్‌ లాంటి రాష్ట్రంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుని ఈ కోణంలోనే ఓట్ల జాతర సాగుతోంది. కులాల ఆధారంగా టిక్కెట్ల కేటాయింపు, మంత్రి పదవుల కేటాయింపులు సాగుతున్నాయి. ఇలా అన్ని రాష్టాల్రకు ఈ జాడ్యం పాకింది. హుజూరాబాద్‌లో ఇప్పుడు అదే జరుగుతోంది. గత కొంతకాలంగా అధికార టిఆర్‌ఎస్‌ అక్కడ కులాల వారీగా పథకాలు ప్రకటించి ముందుకు తీసుకుని పోతోంది. కులాల వారీగా సమావేశాలు పెట్టి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. దళితబంధు కూడా ఈ క్రమంలోనే పుట్టుకుని వచ్చింది. కులం,మతం, జాతి, భాష పేరు చెప్పి ఓటర్లను ఆకర్షించటానికి ప్రయత్నించడం, ఓట్లు వేయమని అడగడం అవినీతేనని, చట్టరీత్యా నేరమని సుప్రీంకోర్టు గతంలోనే తేల్చిచెప్పింది. అయినా పాలకలుఉ, పార్టీల తీరులో మార్పు కానరావడం లేదు. రాజ్యాంగం లోని సెక్యులర్‌ విలువలకు అద్దం పట్టేలా ఎన్నికల పక్రియ ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది. మతం అనేది పూర్తిగా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించినది మాత్రమేనని,రాజ్యానికి, మతానికి ఎటువంటి సంబంధం ఉండకూడదని నిర్దేశించింది. ఇలా ఓట్లు అడగటం అవినీతి కిందికే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విధంగా ఓట్లు అడగటాన్ని నిషేధిస్తూ సంచలన తీర్పును ప్రకటించింది. రాజకీయ నేతలు పరిణతితో చేయాల్సిన పని చేయకపోవడం వల్ల అనేక మార్లు కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. రాజ్యాంగంలోని లౌకిక విలువలకు అద్దం పట్టేలా ఎన్నికల పక్రియను నిర్వహించాలని హితవు పలికింది. మనిషికి దేవుడికి మధ్య ఉన్న సంబంధం పూర్తిగా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు పరిమితమైనదని అందరికీ తెలుసు. కానీ దీనిని కూడా ఓట్ల రాజకీయాలకు జోడిరచి మన నాయకులు, పార్టీలు లబ్దిపొందాలని చూస్తున్నాయి. కుల సంఘాలను ప్రోత్సహించడం, కులాల వారీగా తాయిలాలు ప్రకటించడం ఇవన్నీ కూడా ఓట్ల రాజకీయాలు కాక మరోటి కాదు. రాజ్యాన్ని, మతాన్ని కలగలుపటానికి రాజ్యాంగం అంగీకరించదని మూడేళ్ల క్రితమే సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కుహనా రాజకీయ వాదులకు పార్టీలకు చెంప చెళ్లు మనిపంచేలా చేసింది. ఎన్నికల ప్రజాప్రతినిధి పనితీరు పూర్తిగా లౌకిక విలువలతో కూడి ఉండాలని ధర్మాసనం తెలిపింది. సెక్యులర్‌ పక్రియగా ఉండాల్సిన ఎన్నికల్లో మతానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేస్తూ, ఎన్నికల బరిలో పాల్గొనే అభ్యర్థులతోపాటు ఓట్లు వేసే ఓటర్ల మతం, కులం, జాతి, భాష ఆధారంగా ప్రచారం నిర్వహించటం కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది. కులం, మతం తదితర అంశాలను ఎన్నికల పక్రియలో ఉపయోగించకుండా నిషే ధం విధించటం అన్నది... చట్టాన్ని న్యాయవ్యవస్థ తిరగరాయటం లాంటిదని కూడా అభివర్ణించారు. నిజానికి ఇంతకాలం కులం, మతం, జాతిపై ఆధారపడిన రాజకీయాలు దేశానికి చాలా హాని చేశాయి. జాతీయ సమైక్యతనూ దెబ్బతీశాయి. సుప్రీం తీర్పుతో ఓటుబ్యాంకు రాజకీయాలకు అడ్డుకట్ట పడుతుందని భావించినా అలాంటిదేవిూ జరగడం లేదు. సరికదా ఇంకా కుల రాజకీయాలను వేళ్లూనుకునేలా చేస్తున్నారు. అయితే ఇది కఠినంగా అమలు జరగాలంటే తీర్పును ఉల్లంఘించిన పార్టీల గుర్తింపు ను ఈసీ రద్దు చేసేలా చట్టం రావాలి. గత రెండు దశాబ్దాలుగా రాజకీయాలలో మత ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ఆయా పార్టీలు అనుసరి స్తున్న వైఖరే ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. మతాన్ని పూర్తిగా మనిషి జీవన విధానంలో లేకుండా నిర్మూలించడం
కాదనే స్పష్టత ఉంది. కేవలం పేదరిక నిర్మూలన, కులవ్యవస్థ నిర్మూలన, అణగారిన వర్గాలను పైకి తీసుకుని రావడమన్న భావనలో ప్రచారాలు ఉండాలి. వారి కార్యాచరణ కూడా అదే కావాలి. అలా చేస్తేనే భారత దేశం కులమత రహితంగా అభివృద్ది చెందగలదు. కానీ ఎన్నిక చిన్నదయినా పెద్దదయినా కులమతాలకు అతీతంగా ప్రచారం ఉండడం లేదు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో గత రెండు నెలలుగా సాగుతున్న ప్రచార తీరు దారుణంగా ఉండడం గమనించవచ్చు.