సిటీకి ఆంధ్రా నుంచి అక్రమంగా గంజాయి రవాణా

మాటేసి కొనుగోలుదార్లను పట్టుకున్న పోలీసులు


నల్లగొండ,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : ఆంధ్రా నుంచి హైదరాబాద్‌ సిటీకి గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న నలుగురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్లగొండ జిల్లాలోనే స్మగ్లర్లను అరెస్ట్‌ చేసినప్పటికీ.. పోలీసులు అక్కడితో కథ ముగించలేదు. అసలు ఆ గంజాయి ఎవరికి సరఫరా అవుతుందన్న విషయం తెలుసుకునేందుకు మప్టీలో రంగంలోకి దిగారు. సిటీలో పురాణాపూల్‌లో ఆ గంజాయిని కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్లనూ అరెస్ట్‌ చేశారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను కేతేపల్లి టోల్‌ గేట్‌ సవిూపంలో చిట్యాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎవరికి సప్లై చేస్తున్నారు? అన్న వివరాలను రాబట్టారు. వాళ్లు దానిని హైదరాబాద్‌ సిటీకి తీసుకెళ్తున్నట్లు చెప్పడంతో అక్కడ కొనుగోలు చేయబోయే వాళ్లనూ అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో ఎస్‌ఐ నాగరాజుతో పాటు తన టీమ్‌ మప్టీలో అదే బస్సులో స్మగ్లర్లతో పాటు హైదరాబాద్‌ ట్రావెల్‌ చేశారు. హైదరాబాద్‌లోని పూరాణాపూల్‌లో కొనుగోలు చేసే బ్యాచ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ దందా ఎప్పటి నుంచి నడుస్తోంది? సిటీలో ఎవరెవరికి సప్లై చేస్తున్నారు? లాంటివి రాబట్టేందుకు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.