ఉధృతంగా ప్రవహిస్తున్న వంశధార,నాగావళి

 


ఈదురు గాలులతో కూడిన వర్షాలకు పంటలకు నష్టం
నేలకూలిన కొబ్బరి,అరటి, బొప్పాయి తోటలు
శ్రీకాకుళం,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : జిల్లాలో వంశధార, నాగావళి తదితర నదుల్లో వరదనీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నాగావళి నది ఉగ్రరూపం దాల్చింది. మడ్డువలస వద్ద 55వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు విడుదల చేశారు. బూర్జ, ఆమదాలవలస మండలాల్లోని గ్రామాల్లోకి వరద నీరు చేరింది. నిమ్మతుర్లాడలో జగనన్న కాలనీ, సచివాలయం నీట మునిగాయి. బూర్జ మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నికిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే వంశధార పరవళ్లు తొక్కుతోంది. నదీ పరీవాహక ప్రాంతాలతో ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో గొట్టా బ్యారేజీలోకి ఇన్‌ప్లో గణనీయంగా పెరిగింది. బ్యారేజీ 22 గేట్లు పైకెత్తి వచ్చిన నీటినంతా సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. మరో 5 వేల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని డీఈవో ప్రభాకర్‌ తెలిపారు. అలాగే వంగర మండలం మడ్డువలసకు భారీగా వరద నీరు పోటెత్తింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి భారీగా వదర నీరు వచ్చి రిజర్వాయర్‌లో కలుస్తోంది. దీంతో నాలుగు ప్రధాన గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఇన్‌ప్లోను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, అవసరమైతే అదనంగా గేట్లు తెరవనున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా కొబ్బరి, అరటి, బొప్పాయి చెట్లు నేలకూలగా వరి చేనిలో వరదనీరు ప్రవేశించింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు కూలిపోగా వాటిని పునరుద్ధరించే చర్యల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ రోడ్లపై భారీ వృక్షాలు కూలిపోవడంతో సోమవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. రెండు రోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ఇళ్లపై చెట్లు పడిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వేలాది ఎకరాల పంటలు వరద ముంపుబారినపడ్డాయని రైతులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాలు, పలు వీధుల్లో వరదనీరు బయటకు వెళ్లలేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మెళియాపుట్టి మండలం గోకర్ణపురం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద ప్రభావ ప్రాంతాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు సందర్శించి బాధితులను పరామర్శించారు.