వర్ధంతి సందర్భంగా కెటిఆర్, ఎర్రబెల్లి తదితరుల నివాళి
హైదరాబాద్,సెప్టెంబర్21 (జనంసాక్షి): మాజీ మంత్రి, స్వాతంత్య సమర యోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని టిఆర్‌ఎస్ నేతలు ఆయనకు ఘనంగగా నివాళి అర్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ బాపూ తనవంతు పాత్ర నిర్వహించారని శ్లాఘించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..స్వాతంత్య సమరయోధుడైన బాపూజీ తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు. బాపూజీ అందించిన నిస్వార్థ సేవలను కేటీఆర్ స్మరించు కున్నారు. తొలి, మలిదశ ఉద్యమంలో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, నార్మక్స్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వాంత్రంత్య సమరయోధులు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వరంగల్‌లో ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత గల రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఆయన నిఖార్సయిన తెలంగాణ వాది అని పేర్కొన్నారు. స్వాతంత్యోద్య్రమంలో, నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ ఆయన చురుకుగా పాల్గొన్నారు. 97 ఏండ్ల వయస్సులో కూడా తెలంగాణ కోసం పరితపించి మలి దశ ఉద్యమంలో పాల్గొన్నారని మంత్రి గుర్తు చేశారు.
ఆసిఫాబాదు నుంచి శాసనసభ్యుడిగా అనేక సార్లు ఎన్నికై హైదరాబాదు, ఆంధప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి అనేక సేవలందించారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ది కొరకు కొండా లక్ష్మణ్ బాపూజీ విశేష కృషి చేశారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ఏర్పాటుకు తాను వుంటున్న జల దృశ్యాన్ని అప్పగించిన మహోన్నత వ్యక్తిగా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచిపోతారు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మరావు, డీసీసీబీ డైరెక్టర్ కకిరాల హరిప్రసాద్ రావు, పద్మశాలి సంఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.