నటరాజన్‌కు కోవిడ్‌ పాజిటివ్‌!

  


యూఏఈ వేదికగా ఆరంభమైన ఐపీఎల్‌-2021 రెండో అంచెకు కరోనా సెగ తగిలింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు చెందిన ఆటగాడు నటరాజన్‌కు కోవిడ్‌ సోకింది. ఆర్‌టీ- పీసీఆర్‌ టెస్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, అతడిలో వైరస్‌ లక్షణాలేమీ కనిపించడం లేదని, ప్రస్తుతం ఐసోలేషన్‌కు పంపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నటరాజన్‌కు సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురిని ఐసోలేషన్‌కు పంపినట్లు తెలుస్తోంది.వీరిలో విజయ్‌ శంకర్‌(ప్లేయర్‌), విజయ్‌ కుమార్‌(టీం మేనేజర్‌), శ్యామ్‌ సుందర్‌(ఫిజియోథెరపిస్ట్‌), అంజనా వన్నర్‌(డాక్టర్‌), తుషార్‌ ఖేద్కర్‌(లాజిస్టిక్స్‌ మేనేజర్‌), పెరియసామి గణేషన్‌(నెట్‌​ బౌలర్‌) ఉన్నారు. ఇక కరోనా కలకం నేపథ్యంలో నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. కాగా ఐపీఎల్‌ 14వ ఎడిషన్‌ ఆరంభంలో కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లకు కరోనా సోకిన నేపథ్యంలో... కేకేఆర్‌- ఆర్సీబీ మధ్య జరగాల్సిన ఆనాటి మ్యాచ్‌ను వాయిదా వేశారు.ఆ తర్వాత.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్‌ మిశ్రాకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో.. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనేక చర్చల అనంతరం యూఏఈలో రెండో అంచెను నిర్వహించేందుకు సిద్ధమైన బీసీసీఐ.. సెప్టెంబరు 19 నుంచి తాజా సీజన్‌ను పునః ప్రారంభించింది. ఇప్పటికే చెన్నై- ముంబై, కేకేఆర్‌- ఆర్సీబీ, రాజస్తాన్‌- పంజాబ్‌ మ్యాచ్‌లు జరుగగా.. నేడు(సెప్టెంబరు 22న) ఎస్‌ఆర్‌హెచ్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య దుబాయ్‌లో మ్యాచ్‌ జరగాల్సి ఉంది.