ప్రభుత్వం అన్నది శాశ్వతం.. అధికారులు..రాజ్యాంగం....నిబంధనలు..విలువలు అన్నవి కూడా శాశ్వతంగా ఉండాల్సిందే..పార్టీలు కొత్తగా అధికారంలోకి రావడం అన్నదే ప్రతి ఐదేళ్లకోమారు జరిగే ప్రక్రియ. ప్రజలు తమ తీర్పు ద్వారా కొత్తవారిని ఎన్నుకోవడం...కొత్తవారు అధికారంలోకి రావడం జరుతోంది. కేంద్రరాష్టాల్ల్రో ఇదే ప్రక్రియ ఉంటుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పకుంటున్న భారతదేశంలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడల్లా విలువలు మారిపోతున్నాయి. నిబంధనలు మారుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. కేంద్రంలోని ప్రధాని లేదా..మంత్రులు తప్పు చేస్తే నిలదీసి బోనులో నిలబెట్టే ప్రయత్నాలు జరగడం లేదు. అలాగే అందుకు తగిన వ్యవస్థ లేదు. అలాగే రాష్టాల్ల్రో కూడా అదే జరుగుతోంది. వీరి పాలనపై విజిలెన్స్ లేకుండా పోయింది. కోర్టులు వివిధ సమయా ల్లో జోక్యం చేసుకున్నా ఒకటో అర సందర్భాలు మాత్రమే ఉంటున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా అధికారులు మారుతుంటారు. తమకు అనుకూలమైన వారిని సిఎస్‌లుగా, డిజిపిలుగా మారుస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమన్నది చూడాలి. నిజానికి అందరు అధికారులు ప్రభుత్వంలో భాగంగానే ఉండాలి. కానీ అలా చూడడం లేదు.త అలాగే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలకు అధికారులు బలవుతున్నారు. ఆయా రాజకీయ పార్టీల విధానాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో మరో ప్రభుత్వం రాగానే వారు దోషులుగా మారి బోనెక్కుతున్నారు. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలా అధికారులు ప్రభుత్వ నిర్ణయాలకు బలవుతున్న ఘటనలు అనేకంగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్ర పద్రేశ్‌లో ఆనాటి వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలకు ఎందరో మంత్రులు, ఐఎఎస్‌లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో కూడ ఆపినచేసిన అధికారులు ఇప్పుడు జగన్ ప్రభుత్వం లో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఇంటిలిజెన్స్ చీఫ్‌గా చేసిన వ్యక్తి ఇప్పుడు పోస్టింగ్ లేకుండా ప్రభుత్వం ఆడుకుంటున్న గేమ్‌లో పావుగా మారారు. ఇలా జరుగుతున్న వ్యవహారాలపై చర్చ సాగాలి. పాలకులు పరిమితులు, అధికారుల పరిమితులపై చర్చ చేయాలి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గుర్జీందర్ పాల్ సింగ్ వ్యవహారంలో సుప్రీం చేసిన వ్యాఖ్యలు కనువిప్పు కావాలి. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, పోలీసులు కుమ్మక్కవడం దేశంలో కొత్త విధానంగా మారిందని సోమవారం సుప్రీం కోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించింది. అధికారంలో ఉన్న పార్టీతో సన్నిహితంగా మెలిగి డబ్బులు సంపాదించే పోలీసు అధికారులు ప్రభుత్వం మారినప్పుడు తప్పనిసరిగా తిరిగి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంద ని పేర్కొంది. అలాంటి పోలీసులను ఎందుకు రక్షించాలని కూడా ప్రశ్నించింది. అంటే వారు తమ పరిధి మరచి అధికార పార్టీకి వత్తాసుగా నిలిచి అవినీతి లో భాగస్వామ్యం అయ్యారని పరోక్షంగా సుప్రీం వ్యాఖ్యానించింది. అలాంటి వారు జైలుకు వెళ్లాల్సిందేనని కూడా పేర్కొంది. లంచాలు తీసుకున్నారన్న ఆరోపణపై ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గుర్జీందర్ పాల్ సింగ్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసుతో పాటు, రాజద్రోహం అభియోగాన్ని కూడా మోపింది. ఈ కేసుల్లో తనను అరెస్టు చేయకుండా రక్షించాలని కోరుతూ ఆయన చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ,జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మన వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది. కొత్తగా ఒక పార్టీ అధికారంలోకి రాగానే పాత అధికారులపై కేసులు పెట్టడం.. జైల్లోకి తోయం జరుగుతోంది. ఇలా జరక్కుండా అధికారులు అక్రమాలకు పాల్పడకుండా పరిధిని సక్రమంగా నిర్వచించాలి. గుర్జీందర్ పాల్
సింగ్‌ను ప్రస్తుతం అరెస్టు చేయకూడదంటూ తాత్కాలిక రక్షణ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇలాంటి అధికారుల ప్రవర్తనపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనపై నమోదయిన మరో రెండు కేసుల్లో నూ ఇలాంటి రక్షణ ఆదేశాలే జారీ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ ప్రతి కేసులోనూ విూరు రక్షణ పొందలేరు. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ అక్రమంగా డబ్బును సంపాదించుకోగలిగారు. అయితే ఏదో ఒక రోజున దీన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది మరీ దారుణం. ఇలాంటి అధికారులను ఎందుకు రక్షించాలి? దేశంలో ఇదో కొత్త ధోరణి ప్రబలుతోందని ఘాటుగానే వ్యాఖ్యానించారు. నిజానికి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు అక్రమ మైనవి అయితే ఆ శృాఖ అధికారులు తప్పకుండా వ్యతి రేకించాలి. ఇలా చేయడం కుదరదని చెప్పాలి. కాన అలా ఎదరించే అధికారం అధికారులకు ఉందా అన్నది ఒక ప్రశ్న అయితే..ఎదరిస్తే మాత్రం బదిలీ వేటు పడుతుంది. లూప్‌లైన్‌లోకి తోసేస్తారు. లేదా పోస్టింగ్ ఇవ్వకుండా చేస్తారు. దీని నుంచి అధికారులను రక్షించే విధంగా వ్యవస్థ ఉండాలి. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కల్పించుకొని నిజాయితీపరులైన అధికారులు వేధింపులకు గురవుతున్నారని, అలాంటి వారిని రక్షించాల్సి ఉందని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. మరో కేసులో ఇదే అధికారిని అరెస్టు చేయకుండా ఆగస్టు 26న కూడా సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ప్రభుత్వాలు మారినప్పుడు పోలీసు అధికారులపై రాజద్రోహం, ఇతర కేసులు నమోదు చేయడం కొత్త విధానంగా మారిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అధికారంలో ఉన్న పార్టీ పక్షాన వ్యవహరించినప్పుడు అంతా సవ్యంగా సాగిపోతుంది. పార్టీ మారినప్పుడు అదే అధికారిపై కేసులు నమోదవుతాయి. కుమ్మక్కయ్యే ఈ పద్ధతి మారాలని ఆ సందర్భంగా జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. ఈ తరహా కేసుల్లో గట్టిగానే స్పందించిన సుప్రీం వ్యాఖ్యలతో ఓ రకంగా మనదేశంలో ఉన్న లోపాలు కళ్లకు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా తగిన వ్యవస్థను రూపొందించకుంటే ఇవి పునరావృతం అవుతూనే ఉంటాయి.
అధికారుల తీరు కళంకితం కారాదు !