` నేటి నుంచి అధికార కార్యక్రమాలు
` పలు దిగ్గజ కంపెనీల అధినేతలతో మోదీ భేటీ
వాషింగ్టన్,సెప్టెంబరు 23(జనంసాక్షి): అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అధికారిక కార్యక్రమాలను ప్రారంభించారు. అమెరికాకు చెందిన ఐదు దిగ్గజ కంపెనీల అధినేతలతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా తొలుత క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్‌తో సమావేశమయ్యారు. అనంతరం భారత సంతతికి చెందిన అడోబ్ సీఈఓ శంతను నారాయణ్‌తో పాటు ఫస్ట్ సోలార్,బ్లాక్‌స్టోన్ , జనరల్ అటామిక్స్ సంస్థల సీఈఓలతోనూ భేటీ అయ్యారు. వీటి తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ మోదీ సమావేశం అవుతారు. శనివారం నాడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ ప్రధాని మోదీ ముఖాముఖి సమావేశం కానున్నారు.అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్`నరేంద్ర మోదీ దాదాపు గంటపాటు సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వైట్‌హౌస్‌లో జరుగనున్న ఈ భేటీలో కొవిడ్ నిర్వహణ, అంతరిక్షం, సాంకేతిక రంగాల్లో సహకారం వంటి అంశాల్లో కలిసి పనిచేయడంపై వీరు చర్చించనున్నారు. అయితే, కొవిడ్ మహమ్మారి విజృంభణ వేళ.. జూన్ నెలలో ఈ ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకున్నప్పటికీ వ్యక్తిగతంగా సమావేశమవడం ఇదే తొలిసారి. అమెరికా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాతో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.ఇక భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించడం ఇది ఏడోసారి. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన మోదీ.. సెప్టెంబర్ 25న అంతర్జాతీయ వేదికపై ప్రసంగిస్తారు. వీటితో పాటు అమెరికా అధ్యక్ష భవనంలో జరిగే క్వాడ్ దేశాల కూటమి సదస్సులోనూ ప్రధాని మోదీ పాల్గొంటారు.
పెట్టుబడులే లక్ష్యంగా ప్రధాని పర్యటన