సినీతారలపై డ్రగ్స్‌కేసులో ఆధారాలు లేవు


` తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఛార్జ్‌షీట్‌ దాఖలు
హైదరాబాద్‌,సెప్టెంబరు 20(జనంసాక్షి): డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ వెల్లడిరచింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో కెల్విన్‌పై తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌లో నిందితులు, సాక్షుల జాబితాలో నటుల పేర్లను చేర్చలేదు. కెల్విన్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో నటుల విచారణను ఎక్సైజ్‌ శాఖ ప్రస్తావించింది. డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీల పాత్రపై బలమైన, తగిన ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. నటులు, హోటల్స్‌, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు డగ్స్‌ అమ్మినట్లు డ్రగ్స్‌ సరఫరాదారు కెల్విన్‌ ఇచ్చిన వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉందని తెలిపింది. పలువురికి నోటీసులు ఇచ్చిన సిట్‌ బృందం వారిని ప్రశ్నించిందని.. అన్ని సాక్ష్యాలను పరిశీలించి, విశ్లేషించిందని పేర్కొంది. నిందితుడి మాటలను బలమైన ఆధారాలుగా పరిగణించలేమని తెలిపింది. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్‌ వాంగ్మూలం చాలదని స్పష్టం చేసింది. సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్‌ లభించలేదని వివరించింది. పూరి జగన్నాథ్‌, తరుణ్‌ స్వచ్ఛందంగా శాంపుల్స్‌ ఇచ్చారంది.‘‘కెల్విన్‌కు బెంగళూరులో చదువుకునేటప్పటి నుంచి డ్రగ్స్‌ అలవాటుంది. 2013 నుంచి మిత్రులకు డ్రగ్స్‌ విక్రయించేవాడు. గోవా, విదేశాల నుంచి డార్క్‌వెబ్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించాడు. వాట్సాప్‌, మెయిల్‌ ద్వారా ఆర్డర్లు తీసుకొని డ్రగ్స్‌ సరఫరా చేసేవాడు. చిరునామాలు, ఇతర కీలక వివరాలు కెల్విన్‌ వెల్లడిరచలేదు. కెల్విన్‌ అతని మిత్రుడు నిశ్చయ్‌, రవికిరణ్‌ ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయి. సోదాల సమయంలో కెల్విన్‌ పారిపోయేందుకు ప్రయత్నించాడు’’ అని ఛార్జ్‌షీట్‌లో ఎక్సైజ్‌ శాఖ పేర్కొంది.