గులాబ్‌తో తీరని పంట నష్టం

పలుచోట్ల నీట మునిగిన పంటచేలు
కాకినాడ,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉవ్వెత్తున అలలు ఎగసిపడి సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. ఓడలరేవు, కొమరగిరిపట్నం తీరం వెంబడి కిలోవిూటర్ల మేర భూమి కోతకు గురై సముద్రగర్భంలో కలసి పోయింది. తీరంలో సరుగుడు తోటలు, కొబ్బరితోటలు, అటవీశాఖ భూములు కోతకు గురయ్యాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. తుఫాన్‌ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మన్యంలోని కొండవాగులు పొంగి పొర్లుతు న్నాయి. దీంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బొడ్లంక సవిూపంలోని పెళ్లిరేవు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరికి మళ్లీ వరద తగిలింది. భద్రాచలం వద్ద 20 అడుగుల వరకూ తగ్గిపోయిన వరద 30.70 అడుగులకు చేరింది. దీంతో గోదావరి మళ్లీ పోటెత్తనుంది. ఎగువభాగంలో వర్షాలు, ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయడం వల్ల మళ్లీ నీటి మట్టం పెరుగుతోంది. కాఫర్‌ డ్యామ్‌ వద్ద వరద ఉరకలు వేస్తోంది. స్పిల్‌వే నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టు వదిలేస్తున్నారు. మరింత పెరిగితే ఏజెన్సీ గ్రామాలకు మళ్లీ ముంపు తప్పదు. ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం పెరగడంతో వరద ప్రవాహం పోతోంది. గోదావరి ఉధృతంగా ఉన్నా అఖండగోదావరిలో పడవల విూద ఇసుక తీయడం మానడం లేదు.