నెలాఖరుకు కొత్త మద్యం పాలసీ


లైసెన్సుల కేటాయింపు కోసం ఎదురుచూపు

హైదరాబాద్‌,అక్టోబర్‌26  (జనం సాక్షి)  కొత్తగా మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. నవంబరు మాసాంతానికి లైసెన్సుల గడువు ముగియనుండడంతో ఈనెల చివరి వారంలో కొత్త మద్యం పాలసీపై నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్టు ఎక్సైజ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మద్యం వ్యాపారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త దుకాణాల వేలం పాటలకు త్వరలోనే ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. రెండేళ్లుగా కొవిడ్‌`19 విజృంభన
నేపథ్యంలో పలు దఫాలు లాక్‌డౌన్‌ విధించారు. దీంతో నష్టపోయామన్న వ్యాపారులు విజఙప్తి మేరకు ప్రభుత్వం లైసెన్సింగ్‌ గడువును నెల రోజుల పాటు పొడగించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించబోయే నూతన మద్యం విధానంలో అక్కడ కూడా ఈ సారి లైసెన్సులు జారీచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబరు మొదటి వారంలో టెండర్ల పక్రియ నిర్వహించి దుకాణాల కేటాయింపులు పూర్తిచేసే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటికీ ప్రభుత్వ ఆలోచన ఏంటన్నదానిపై ఎవరికీ స్పష్టత లేకపోవడంతో మద్యం దుకాణాలకు టెండర్లు వేసే ఆలోచనలో ఉన్న వ్యాపారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అదీ కాకుండా ఈ సారి దరఖాస్తు ఫారంల విలువ రూ.3లక్షలకు పైన్నే నిర్ణయించే అవకాశాలు న్నట్టు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో గతంలో వచ్చినట్టుగా ఈ సారి స్పందన పెద్దగా వచ్చే పరిస్థితి ఉండక పోవచ్చని అంచనా వేస్తున్నారు. అదీ కాకుండా షాపుల సంఖ్య పెరగటం, కొవిడ్‌తో వ్యాపారం మందగించడం అంశాలను పరిగణలోకి తీసుకొని వ్యాపారులు ఆచితూచి వ్యవహరించే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన కొత్త మద్యం విధానం ప్రకారం అయిదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షలు లైసెన్సు ఫీజు, 5వేల నుంచి 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా కలిగిన ప్రాంతాల్లో రూ.60లక్షలు, లక్ష జనాభా నుంచి అయిదు లక్షల లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65లక్షలు, 5లక్షల నుంచి 20లక్షల జనాభా కలిగి ప్రాంతాలకు రూ.85లక్షలు, 20లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10కోట్లుగా ఏడాది లైసెన్సు ఫీజును ఖరారు చేసి వసూలు చేసింది. ఈ లెక్కన రెండేళ్లకు గాను కోటి రూపాయలు, రూ.1.10 కోట్లు, రూ.1.20 కోట్లు, రూ.1.30 కోట్లు, రూ.1.70 కోట్లు, రూ.2.20కోట్ల చొప్పున ఒక్కోదుకాణం లైసెన్సు ఫీజు చెల్లించింది. అయితే కొత్త విధానంలో ఎలాంటి మార్పులు ఉంటాయో అన్నది తెలియాల్సి ఉంది.