భారీ వర్షాలతో చెరువులకు జలకళ

ఆనందంలో జిల్లా రైతాంగం

అనంతపురం,అక్టోబర్‌11(  జనంసాక్షి): అనంతపురంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి చెరువులు నిండినా, అదేస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జల వనరుల శాఖ అధికారులు, ఇంజినీర్ల నిర్వాకం, నిర్లక్ష్యంతో వాన నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితి తలెత్తింది. అనేక చెరువులకు గండ్లు పడి.. కట్టలు తెగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొన్ని చెరువుల కట్టలు తెగి నీరంతా వృథాగా దిగువుకు వెళ్లిపోయింది. జిల్లాలోని పలు మండలాల్లో శుక్ర, శనివారాల్లోభారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఓబుళదేవరచెరువు, కదిరి, పుట్టపర్తి, కంబదూరు, ముదిగుబ్బ, నంబులపూలకుంట, పెనుకొండ, గోరంట్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడిరది. ఉరవకొండ, కణెళికల్లు, శెట్టూరు, పామిడి, పుట్లూరు, గార్లదిన్నె, నార్పల, బత్తలపల్లి, తలుపుల, అగళి, గుత్తి, అమరాపురం, బెళుగుప్ప, గుడిబండ ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తారు వర్షం కురిసింది. కదిరిలో భారీ వర్షం కురిసింది. ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రధాన ద్వారం వద్ద పెద్దఎత్తున వర్షపు నీరు చేరింది.
రబీ సీజన ఆరంభమైన తర్వాత జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నల్లరేగడి భూములున్న ప్రాంతాల్లో పదును వర్షం పడటంతో పప్పుశనగ విత్తనం వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.
ఇదివరకే కొందరు రైతులు విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. మరికొందరు సబ్సిడీ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. పొలాల్లో పదును ఆరిన తర్వాత రైతులు విత్తనం వేసేందుకు సిద్ధమవుతున్నారు.
భారీ వర్షాలతో జిల్లాలో చెరువులకు ఎక్కడైనా గండ్లు పడే ప్రమాదం ఉందా. కట్టల సామర్థ్యం ఏ స్థాయిలో ఉన్నాయన్న దానిపై కనీస పర్యవేక్షణ లేకుండాపోయింది. వీరి నిర్వాకంతో దశాబ్దాల తర్వాత చెరువుల్లోకి వచ్చిన నీటిని సంరక్షించుకునే అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాలకు జిల్లాలో వాగులు, వంకలు ఏరులై పారాయి.చెరువుల్లోకి వాన నీరు దండిగా వచ్చి చేరింది. తమ చెరువుల్లోకి వాన నీరు వచ్చిందంటూ
ఉత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. జిల్లాలో అనేక చెరువుల, మధ్య తరహా నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. దశాబ్దాల తరబడి ఈ ఆయకట్టు బీడుగా ఉంది. తాజాగా కురిసిన వర్షానికి ఏకంగా చెరువులన్నీ నిండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో చెరువుల కింద ఉన్న ఆయకట్టు సాగులోకి రానుంది. ఆరుతడి పంటలు పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడిరది. గతంలో ఎపుడూ లేనివిధంగా పెద్దపెద్ద చెరువులు సైతం నిండుతున్నాయి.