థర్డ్‌వేవ్ విషయంలో ఇక ఏ మాత్రం సంశయాలూ అక్కరలేదన్న హెచ్చరికలు మళ్లీ మొదలయ్యాయి. వివిధ దేశాల్లో నమోదవుతున్న కేసులతో పాటు, భారత్‌లో బయటపడ్డ కొత్త వేరియంట్ దీనిని సూచిస్తోంది. ప్రపంచం మొత్తాన్ని మరోమారు వైరస్ చుట్టుముట్టే ప్రమాదం త్వరలోనే ఉన్నదని కొందరు హెచ్చరి స్తున్నారు.చాలా దేశాలు మళ్లీ పాక్షిక లాక్‌డౌన్, వారంతపు కర్ఫ్యూలతో వైరస్ వ్యాప్తిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నాయి. చైనాలో కూడా లాక్‌డౌన్ దిశగా కొన్ని ప్రాంతాలను ప్రకటించారు. బ్రిటన్‌లో కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. రష్యాలో మరిన్ని మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మళ్లీ కరోనా థర్డ్‌వేవ్ రూపంలో విజృంభిస్తుంటే లక్షలాదిమంది ఉపాధి దెబ్బతినే పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతాయి. కరోనా ఉధృతి పూర్తిగా తగ్గుముఖం పట్టిన క్రమంలో మళ్లీ వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. సెకండ్‌వేవ్‌లో అది చూపిన ప్రభావం అంతాఇంతాకాదు. ఎందరినో పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు దాని విజృంభణకు ప్రజల నిర్లక్ష్యమే కారణమని వేరుగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే కరోనా ఉధృతి తగ్గలేదని..అందువల్ల మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం నిరంతరగా సాగాలని హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు వాక్సినేషన్ పక్రియను చాలా దేశాలు వేగవంతం చేశాయి. మనదేశంలో వారం క్రితమే వందకోట్ల డోసులకు చేరుకుని ప్రపంచంలో నంబర్‌వన్‌గా నిలిచాం. అమెరికా వంటి ధనిక దేశాలైతే ప్రతీపౌరుడికీ టీకా రక్షణ కల్పించబోతున్నాయి. అదేసమయంలో ఎప్పటినుంచో నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగా టీకా అసమానతలు కూడా స్పష్టంగా బయటపడుతున్నాయి. పేద, ధనిక దేశాల మధ్య టీకా పంపిణీలో తేడా వేలాదిమంది ప్రాణాలు హరిస్తున్నది. ఉత్పత్తి అయిన మొత్తం టీకాలో మూడువంతుల భాగాన్ని పట్టుమని పదిదేశాలు తరలించుకుపోయాయి. టీకా తయారీ సంస్థలతో ధనికదేశాలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదర్చుకున్న కారణంగా సరఫరాకు విఘాతం ఏర్పడి పేదదేశాలకు ఇప్పటికీ అందడం లేదు. అత్యవసర వినియోగానికి అనుమతించమంటూ టీకా ఉత్పత్తి సంస్థలు ధనికదేశాలకు దరఖాస్తులు చేయడం, అనుమతి సంపాదించి సరఫరాలు జరపడం ఒక పద్ధతి ప్రకారం సాగిపోతోంది. వాక్సిన్ సరఫరా లో జాప్యం వల్ల వేలాది ప్రాణాలు హరించుకుపోయే ప్రమాదం ఉన్నది. కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థలతో ఈ దేశాలు ప్రజారోగ్యాన్ని పరిరక్షించలేని స్థితిలో ఉన్నాయి. ఇదంతా సెకండ్‌వేవ్‌లో చూసిన అనుభవాలు. ఇక థర్డ్‌వేవ్ ఎలా ఉండబోతున్నదీ తెలియాల్సి ఉంది. ఈక్రమంలో మనదేశంలో కరోనా కొత్త వేరియంట్ ఏవై 4.2 వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. కర్ణాటకలో ఏడుగురికి ఈ వేరియంట్ సోకినట్లు తేలింది. బాధితుల్లో ముగ్గురు బెంగళూరుకు చెందిన వారు కాగా.. మిగిలిన నలుగురు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారు. ఏవై.4.2 కేసులు వెలుగు చూడటంతో కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ వేరియంట్ బాధితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు.. ఒక బృందం బాధితుల ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. అనుమానిత వ్యక్తుల నమూనాలను జన్యు పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండోర్‌లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రష్యా, చైనా, బ్రిటన్‌లో మళ్లీ నమోదవుఉతన్న కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి చైనాలో మరోసారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజలుగా దేశంలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన డ్రాగన్.. మరోసారి ఆంక్షల బాట పట్టింది. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా అనేక స్కూళ్లు, పర్యాటక ప్రాంతాలను మూసి వేసిన చైనా తాజాగా 40 లక్షల జనాభా ఉన్న లాంగ్‌జువో నగరంలో లాక్‌డౌన్
విధించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బైటికి రావద్దని గట్టిగా హెచ్చరించింది. చైనాలో గత కొన్ని రోజులుగా డెల్టా వేరియంట్ విజృంభణ కొనసాగుతోంది. ఓ వృద్ధ జంట షాంఘైనుంచి పలు ప్రావిన్స్ లలో పర్యటించింది. వారిలో కొవిడ్ లక్షణాలు కనిపించడంతో అధికారులు వారి కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టారు. అనంతరం వారితో సన్నిహితంగా మెలగిన వారిని పరీక్షించగా డజన్ల సంఖ్యలో కేసులు బయట పడ్డాయి. ఇప్పటికే 100కు పైగా కొత్త కేసులు బైటపడ్డాయి. గాన్సు ప్రావిన్స్ రాజధాని అయిన లాంగ్‌జువో నగరంలో సైతం దాదాపు 30 కేసులువెలుగు చూశాయి. దీంతో ఉలికి పడిన చైనా కఠిన అంక్షలను తీసుకు వస్తోంది. రానున్న రోజుల్లో వైరస్ నిర్దారణ పరీక్షలు భారీగా పెంచుతున్నామని, దీనివల్ల కొత్త కేసులు మరింతగా పెరిగే అవకాశముందని ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. మరో వైపు వచ్చే ఆదివారం జరగాల్సి న బీజింగ్ మారథాన్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. రేసులో పాల్గొనే వారు. సిబ్బంది, స్థానిక పౌరులను కాపాడేందుకే ఈ రేసును రద్దు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 2020లో జరగాల్సిన ఈ మారథాన్ ను కరోనా కారణంగా వాయిదా వేశారు. ఇదిలా ఉండగా కరోనావైరస్‌పై పోరులో భాగంగా చాలా దేశాలు వ్యాక్సినేషన్‌ను విస్తృతంగా చేపట్టడంతో పాటుగా వైరస్‌తో కలిసి జీవించే వ్యూహాలను అమలు చేస్తున్నా యి. కానీ చైనా మాత్రం జీరో కొవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఒక్క కేసు నమోదు అయినా ఆ ప్రాంతాలను మూసి వేసి లక్షల సంఖ్యలో కొవిడ్ నిర్దారణ పరీక్షలను చేపడుతోంది. మరో వైపు చైనాలో వ్యాక్సిన్ పంపిణీ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు 200 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే మెచ్చరికలు చేస్తూనే ఉంది. అలాగే మనదేశంలోనూ పండగల వేళ అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని ఎయిమ్స్ చీఫ్ గులేరియా హెచ్చరించారు. దేశంలో కొత్త వేరియట్ లక్షణాలు వస్తున్నాయంటే మనమంతా మరింత అప్రమత్తంగా ఉండాలి. వ్యాక్సిన్ తసీఉకోవడం ఒక ఎత్తయితే వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మరింత జాగ్రత్తలు పాటిస్తూ జీవనం గడపాలి. మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించడం వంటివి నిత్యకృత్యమని, వాటి పని అయిపోలేదని గుర్తించాలి. దేశంలో ఇప్పటికే ప్రజలంతా కరోనా పోయిందన్న భావనలో ఫ్రీగా తిరిగేస్తున్నారు. జాతరలు, పండగలు, పబ్బాలకు విచ్చలవిడిగా వెళుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడి నుంచయినా కరోనా మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉంది.
వణికిస్తున్న థర్డ్‌వేవ్ హెచ్చరికలు !