బిసి గణన ఎందుకు లెక్కించరు


కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఉద్యమిస్తాం

వకుళాభరణంనకు సన్మాన సభలో కృష్ణయ్య
కరీంనగర్‌,అక్టోబర్‌21(జనం సాక్షి ): వన్యప్రాణులను లెక్కించే కేంద్ర ప్రభుత్వం బిసిల జనాభాను ఎందుకు గణించడం లేదని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ప్రశ్నించారు. 2021 జనాభా గణనలో బిసిల లెక్కలను తీయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఒకవేళ కేంద్రం విముఖత చూపితే జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఎల్కతుర్తి మండలం పెంచికలపేటలో రాష్ట్ర స్థాయి బిసిల ఆత్మీయ సమ్మేళనం గురువారం ఉదయం జరిగింది. బిసి కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణ మోహన్‌ రావును బిసి కులసంఘాలు ఘనంగా సత్కరించాయి.ఈ కార్యక్రమానికి ఆర్‌.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బిసిలకు రాజ్యాధికారం వచ్చేలా బిసిలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. తన ఏడేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ బిసిలకు చేసిన మేలేవిూ లేదని ఆయన మండిపడ్డారు. బిసిల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తాము చాలా ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నప్పటికీ , కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. 2021 జనాభా లెక్కల్లో బిసిల గణన చేయలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిసిల సంక్షేమాన్ని పట్టించుకోని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రగతి నిరోధక శక్తిగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రంలలోని బిజెపి అవలంభిస్తున్న బిసి వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి టంగుటూరి రాజ్‌ కుమార్‌,కార్యదర్శి రావుల అశోక్‌,డివిజన్‌ అధ్యక్షుడు ఖాజీపేట కృష్ణ, ప్రధాన కార్యదర్శి కన్నెబొయిన మహేందర్‌ యాదవ్‌,నియోజక వర్గం అధ్యక్షులు బండారు సదానందం, హుస్నాబాద్‌ నియోజకవర్గ బి.సి.నేత పిడిశెట్టి రాజు తదితరులు ఆహ్వాన కమిటీ ప్రతినిధులుగా వ్యవహరించారు. సమన్వయ కర్తలుగా వంగల హన్మంత్‌ గౌడ్‌ ,ఖాజీపేట శ్రీనివాస్‌, కొలిపాక సమ్మయ్యలు సాఫీగా సభను నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బిసి సంఘం జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు.