గెల్లును గెలిపిస్తేనే అభివృద్ది


ఈటెలతో హుజూరాబాద్‌కు వచ్చే లాభం లేదు

ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు విమర్శలు
కరీంనగర్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉపఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు ప్రజలను కోరారు. జూఠా మాటలతో వస్తున్న బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌ కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈటలకు ఓటేస్తే , ఎటువంటి ఉపయోగం ఉండదని, అదే గెల్లుకు ఓటేస్తే , హుజూరాబాద్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని హరీశ్‌ రావు స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రంలో షీ టీమ్స్‌ ను ఏర్పాటు చేశామని, మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సోమవారం హరీశ్‌ రావు నియోజకవర్గ పరిధిలోని బూజునురు గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన గ్రామానికి చెందిన మహిళలతో ముచ్చటించారు. రికార్డుస్థాయి మెజార్టీతో గెల్లును గెలిపించి, సిఎం కెసిఆర్‌ కు కానుకగా ఇవ్వాలని ఆయన చెప్పారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఈటల రాజేందర్‌ స్వార్థం వల్ల వచ్చింది. హుజూరాబాద్‌ జిల్లా కావాలనో, హుజూరాబాద్‌కు మెడికల్‌ కాలేజీ కావాలనో ఆయన రాజీనామా చేశారా? స్వలాభం కోసం రాజీనామా చేశారు. వ్యక్తి లాభం ముఖ్యమా.. వ్యవస్థ లాభం ముఖ్యమా అన్నది ప్రజలు ఆలోచన చేయాలని హరీశ్‌రావు అన్నారు.బీజేపీ ప్రజలకు ఏం చేసిందని ఆ పార్టీలో చేరారో ఈటల రాజేందర్‌ ప్రజలకు చెప్పాలన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలు చేసిన బీజేపీ.. నిన్న మరో రూ.15 పెంచి ప్రజలకు వాతలు పెడుతోందని విమర్శించారు.
ధరలు పెంచే బీజేపీకి ఓటు వేయాలా? బీజేపీ పాలిత రాష్టాల్ల్రో ఎక్కడైనా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల సాయం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ’ఆరుసార్లు ఈటలను గెలిపించినా ఒక్క ఇల్లు కట్టలేదు. గెల్లుని గెలిపిస్తే డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని’హావిూఇచ్చారు. ఎంపీ బండి సంజయ్‌ గెలిచి రెండేళ్లు దాటినా ఒక్క పని అయినా చేశాడా అని నిలదీశారు.