కేంద్ర విధానాలతోనే రాష్టాల్రకు శాపం


కేంద్రం వల్ల రాబోయే రోజుల్లో విద్యుత్‌ సంక్షోభం

మండిపడ్డ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి
200ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని వెల్లడి
హైదరాబాద్‌,అక్టోబర్‌12( జనం సాక్షి ) : దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్న వేళ కేంద్రం తీరుపై రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి మండిపడ్డారు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే అని జగదీశ్‌ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాబోయే రోజుల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని మంత్రి జగదీశ్‌ రెడ్డి చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో కూడా విద్యుత్‌ కోతలు వచ్చే అవకాశం ఉంది. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకో వాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాల వలన రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు వస్తాయి కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో ఎక్కడ కూడా కోతలు లేవు. ప్రైవేట్‌ కంపెనీలకు విద్యుత్‌ సంస్థలను ధారాదత్తం చేసేందుకే ఈ బొగ్గు కృత్రిమ కొరత అని నిపుణులు అంటుంటే నిజమే అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తోనే ఇవాళ దేశంలో విద్యుత్‌ కోతలు సంభవించాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్టాల్ర హక్కు లను కాలరాయొద్దు అని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. అయితే రాష్ట్రంలో రెండు వందల ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. తెలంగాణలో విద్యుత్‌ కోతలకు ఆస్కారమే లేదని మంత్రి తేల్చిచెప్పారు. ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో పవర్‌ కట్‌ ఉండదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను హైదరాబాద్‌కు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మళ్ళీ హైదరాబాద్‌ నుండి ఇతర జిల్లాలకు సరఫరా చేసేలా విద్యుత్‌ వలయం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. హైడల్‌ పవర్‌ ఉత్పత్తి కూడా బాగుందన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరులో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ తెలంగాణకు పూర్తిస్థాయిలో సరిపోతుంది అని మంత్రి స్పష్టం చేశారు. గత ఏడాది 16 వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ అవసరం ఉంటే అంతే మొత్తంలో సరఫరా చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.