సింగరేణి కార్మికులకు బోనస్‌..


` సగటున ఒక్కో కార్మికునికి రూ.1.15 లక్షలు
హైదరాబాద్‌,అక్టోబరు 6(జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగరేణి కార్మికులకు ప్రకటించిన 29 శాతం లాభాల బోనస్‌ సొమ్మును కార్మికులకు ఈ నెల 11వ తేదీన చెల్లించనున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. నవంబర్‌ 1న దీపావళీ బోనస్‌, ఈ నెల 8న పండుగ అడ్వాన్స్‌ను చెల్లించనున్నట్లు చెప్పారు. లాభాల బోనస్‌ రూ. 79.07 కోట్లు, దీపావళి బోనస్‌ రూ. 300 కోట్లు సింగరేణి సంస్థ చెల్లిస్తుందన్నారు. దీపావళి బోనస్‌ కింద ప్రతీ కార్మికుడు రూ. 72,500 అందుకోనున్నారని సీఎండీ వెల్లడిరచారు. రెండు బోనస్‌ల చెల్లింపునకు సింగరేణి 379.07 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. సింగరేణి సంస్థ పండుగ అడ్వాన్స్‌ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేలు ప్రకటించిందని.. ఈ డబ్బును ఈ నెల 8న చెల్లించనుందని సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్‌ కలిపి ఒక్కో కార్మికుడు సగటున సుమారు రూ.1.15 లక్షల వరకు అందుకోనున్నట్లు సీఎండీ చెప్పారు.