ముగగిసిన గోదావరి యాజమాన్యబోర్డు భేటీ


పెద్దవాగు ప్రాజెక్టును  ఆధీనంలోకి తీసుకునే అంశంపై చర్చ

హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి)

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. హైదరాబాద్‌లోని జలసౌధలో జీఆర్‌ఎంబీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ, ఏపీ అధికారులు భేటీలో పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఈ నెల 14 నుంచి అమలులోకి రానున్నది. ఈ క్రమంలో పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు ఆధీనంలోకి తీసుకునే విషయంపై చర్చించారు. సమావేశం అనంతరం తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ విూడియాతో మాట్లాడారు. పెద్దవాగు నుంచి గెజిట్‌ అమలు చేస్తామని బోర్డు తెలిపిందని చెప్పారు. రెండు రాష్టాల్రు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని, అధికారులు, ఆపరేషన్‌లు ఏ రాష్టాన్రికి ఆ రాష్ట్రం చేసుకోవాలని బోర్డు చెప్పినట్లు రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. బోర్డు కేవలం పర్యవేక్షణ మాత్రమే చూసుకుంటుందన్నారు. సీడ్‌ మనీ వ్యయం విషయంలో బోర్డును స్పష్టత అడిగినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా వివరాలు చెబితే నిధులను మంజూరు చేస్తుందని, గెజిట్‌లో ఎక్కడా ప్రాజెక్టుల స్వాధీనం చేసుకునే విధానం లేదన్నారు. తాము అప్పగిస్తేనే బోర్డు పరిధిలోకి వెళ్తాయని, పెద్దవాగు విషయంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం ఆమోదిస్తేనే బోర్డు పరిధిలోకి వెళ్తాయని స్పష్టం చేశారు..