దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చర్యలు

ఆస్తుల గుర్తింపునకు కసరత్తు

అమరావతి,అక్టోబర్‌11(  జనంసాక్షి): దేవాలయాల ఆస్తులను కూడా ఆన్‌లైన్‌ చేయాలని చూస్తున్నారు. ఆయా దేవాలయాలకు ఉన్న ఆస్తులను, భూముల వివరాలను సేకరించి ఒకే గొడుగు కిందకు తేనున్నారు. దేవాదాయశాఖ ఆస్తుల పరిరక్షణకు, వాటి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జియోట్యాగింగ్‌ విధానాన్ని అమలు చేయడానికి ప్రణాళిక చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, సంస్థల పరిధిలో అధిక శాతం భూములున్నాయి. ఈ భూములను లీజుకు ఇవ్వడం, ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తున్నా ఎంతవరకు అన్యాక్రాంతమవుతున్నాయి, లీజుకిచ్చిన భూముల్లో ఏ పంటపడిస్తున్నారో, ఆ భూములను ఏ విధంగా వినియోగిస్తున్నారో తదితర పరిస్థితులున్నాయి. అలాగే రాష్ట్రంలోని ప్రధాన దేవస్థానాల్లో భక్తులకు అందుతున్న సేవలు, ఇతర వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ ప్రగతి ద్వారా ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళిక జరుగుతోందని సమాచారం. దర్శన, వ్రత, ఇతర సేవల టికెట్లు, ప్రసాదం విక్రయాలు ఇతర అన్ని వివరాలు అనుసంధానం చేస్తారు. అలాగే ఆలయం ఓ చోట ఉంటే భూములు, ఇతర ఆస్తులు ఇతర ప్రాంతాల్లో ఉండటంతో వాటి పర్యవేక్షణ కొరవడిరది. అనేక చోట్ల భూములు, దుకాణాలు అన్యాక్రాంతమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇకపై ఆస్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీనిద్వారా ఆలయ ప్రాంగణాలు, స్థలాలు, వ్యవసాయ భూములు, దుకాణాలు, ఇతర ఆస్తులన్నీ జియోట్యాగింగ్‌ చేస్తారు. ఈ పక్రియను కొద్దిరోజుల వ్యవధిలోనే పూర్తిచేయడానికి కసరత్తు జరుగుతోంది. దాంతోపాటు ఆలయ ప్రాంగణాలు సుందరంగా తీర్చిదిద్దేందుకు భారీ మొక్కలు నాటి, వాటికి కూడా జియోట్యాగింగ్‌ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్నవరం దేవస్థానంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు కూడా విలువైన భూములున్నాయి. అన్నవరం, అంతర్వేది, పిఠాపురం, కోరుకొండ, కట్రావులపల్లి, శ్రీసంస్థానం సత్రం, ఎం.ఎస్‌.ఎన్‌.ఛారిటీస్‌ తదితర జిల్లాలో దేవాదాయశాఖకు చెందిన సుమారు 33 వేల ఎకరాలు,ఇతర జిల్లాల్లోని ఆలయాలు, సంస్థల భూములు కూడా జిల్లాలో భూములున్నాయి. వీటి ద్వారా ఏటా రూ. 35 కోట్ల వరకు ఆదాయం వస్తోంది.