సద్దుల బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు


కోమటి చెరువు సహా అంతటా లైటింగ్‌ పనులు

సిద్దిపేట,అక్టోబర్‌12 (జనం సాక్షి) : సద్దుల బతుకమ్మ వేడుకలకు సిద్దిపేట పెట్టింది పేరు. ఇక్కడ భారీగా బతుకమ్మను ఆడుతారు. పట్టణంతో పాటు, జిల్లా అంతటా భారీగా ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట కోమటి చెరువు వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. లైటింగ్‌తో పాటు సుందరీకరణ చేపట్టారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బతుకమ్మ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలను చాటి చెప్పే గొప్ప పండుగ అని, పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రజలకు ఆయన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూలను, ప్రకృతిని ప్రేమిం చే గొప్ప పండుగ బతుకమ్మ అని ఆ సంస్కృతి, సంప్రదాయాలను దేశ విదేశాలకు చాటిచెప్పిన జిల్లా సిద్దిపేట అన్నారు. ఈ గొప్ప సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడి భవిష్యత్‌ తరాలకు అందించాలని హరీశ్‌రావు అన్నారు. త్యాగాల పునాదుల విూద సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఏ స్థాయిలో ఉన్నా తమ సంస్కృతి, సంప్రదాయాలు మరిచిపోవద్దన్నారు. నేడు బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తం అయిందన్నారు. బతుకమ్మ పండుగకు సిద్దిపేట వేదిక అన్నారు. వైశ్యులు చేసిన బతుకమ్మను చూస్తే చాలా సంతోషంగా ఉందని, చిన్న పిల్లలతో అక్కా చెల్లెళ్లతో, అన్నదమ్ముళ్లతో ఆనందంగా పండుగ జరుపుకోవడం హర్షణీయమన్నారు.నేడు వ్యవసాయరంగం లోని సంక్షోభాన్ని పారద్రోలేందుకు, రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి
హరీశ్‌రావు అన్నారు. ఇకపోతే సద్దుల బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి జిల్లా వ్యాప్తంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దుబ్బాకలో సద్దుల బతుకమ్మకు నగర పంచాయతీ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దుబ్బాక పెద్ద చెరవు కట్టపై నుంచి లచ్చపేట గ్రామ శివారు లోని కట్ట వరకు లైటింగ్‌ పనులు సాగుతున్నాయి. నిమజ్జనం చేసే ప్రాంతాలతో పాటు బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో లైట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ ఊరేగింపు సాగే రోడ్ల వెంట మట్టిని చదును చేస్తున్నారు. మట్టిని చదును చేయడంతో పాటు పిచ్చిమొక్కలను తొలగించే పనిలో నగర పంచాయతీ సిబ్బంది నిమగ్నమయ్యారు. గతంకంటే ఈ సారీ బతుకమ్మ పండుగను దుబ్బాకలో ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. దుబ్బాక చెరువు లోపల భారీ లైటింగ్‌తో పాటు కట్టపై వీధిదీపాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు బతుకమ్మ నిమజ్జనం కోసం మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చెరువుల వద్ద ముందస్తుగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైనారు.