తెలంగాణ వర్సిటీలో అక్రమంగా నియామకాలు

 


ఔట్‌ సోర్సింగ్‌ఉద్యోగాల్లో పెద్ద ఎత్తు అక్రమాలు
విద్యార్థి సంఘాల ఆందోళనలతో బట్టబయలు
30న టీయూ ఈసీ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ
నిజామాబాద్‌,అక్టోబర్‌28 జనం సాక్షి : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇటీవల చేపట్టిన ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పలు విమర్వలు, ఆరోపనలు రావడంతో దీనిపై విచారణకు సిద్దం అవుతోంది. ఈ క్రమంలో తమ ఉద్యోగాల ఉంటాయో ఊడుతాయో అన్న ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు. టీయూలో ఇటీవల ప్రభుత్వ, పాలకమండలి అనుమతులు లేకుండా ఔట్‌ సోర్సింగ్‌లో చేపట్టిన అక్రమ నియామకాలను రద్దు చేయాలని ఉన్నత విద్యామండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఆదేశాలు అమలు చేయాలని విద్యార్థిసంఘ నేత శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. వర్సిటీలో పనిభారం ఉంటే ప్రభుత్వ, పాలక మండలి అనుమతులు తీసుకొని ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఇలా అక్రమంగా నియామకాలు చేయడం సరికాదన్నారు. ఈ క్రమంలో నెల 30న జరగనున్న పాలక మండలి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎజెండాలోని అంశాలు ఆమోదం పొందుతాయాలేవో అని అనుమానాలకు తావిస్తోంది. పాలక మండలి సభ్యులకు 12 గంటల ముందుగానే ఎజెండా పత్రాలు గత సమావేశంలో టీయూ
అధికారులు అందించడంతో ఆ ఎజెండా అంశాలను పాలక మండలి సభ్యులు నవీన్‌ మిట్టల్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసీ సభ్యులను మచ్చిక చేసుకోవడానికి యూనివర్సిటీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది వరకే నవీన్‌ మిట్టల్‌ ఎదుట ఈసీ సభ్యులు వీసీ, రిజిస్ట్రార్‌ల పని తీరుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 30న జరిగే ఈసీ సమావేశంలో ఎలాంటి గలాటా చేయకుండా వర్సిటీ పరువు కాపాడేందుకు రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిళ్లు చేయిస్తున్నట్లు సమాచారం. ఈ నియామకాలను రద్దు చేయాలని ఉన్నత విద్యామండలి ఆదేశించినా వీసీ, రిజిస్ట్రార్‌ తీరులో ఏమాత్రం స్పందన కానరావడంలేదు. పైకి రద్దు చేస్తున్నట్లు ప్రకనటలు గుప్పిస్తున్నా.. సదరు సిబ్బంది విధులకు హాజరవుతుండడం గమనార్హం. ఈ విషయమై ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈసీ సమావేశంలో ఉన్నత విద్యామండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ వర్సిటీలో అక్రమంగా నియమించిన 113 మంది ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను రద్దు చేయాలని వీసీ రవీందర్‌ గుప్తా, రిజిస్ట్రార్‌ కనకయ్యలను మందలించినా.. వారు ఎటూ తేల్చకపోవడం పై పలు అనుమానాలకు తావిస్తోంది.
పరిపాలన భవనంలో ఏఈ ఆఫీస్‌తో పాటు పరీక్షల విభాగం, సెక్యూరిటీ విభాగం, భిక్కనూరు సౌత్‌ క్యాంపస్‌, సారంగాపూర్‌ బీఈడీ కళాశాలలో అటెండర్స్‌, స్కావెంజర్‌ విధులకు హాజరు అవుతున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. నియామకాల కోసం వర్సిటీ అధికారులు లక్షలాది రూపాయలు తీసుకోవడం వల్లే వారు దర్జాగా విధులు నిర్వర్తిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమ నియామకాలపై నవీన్‌ మిట్టల్‌ హైదరాబాద్‌లో జరిగిన ఈసీ సమావేశంలో వీసీ, రిజిస్ట్రార్‌లపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నియామకాలు చేసిన పోస్టులను రద్దు చేయాలని హెచ్చరించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ కనకయ్య అన్ని విభాగాల డీన్‌లతో హడావుడిగా సమావేశాలు నిర్వహించడంపై ఆసక్తి నెలకొంది. కాగా అక్రమ నియామకాలపై సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని డీన్‌లను ఆదేశించిన్నట్లు సమాచారం. వర్సిటీలో ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలను చేపట్టలేదని టీయూ రిజిస్ట్రార్‌ కనకయ్య స్పష్టం చేశారు.