రైతులపై బీజేపీ రాక్షసంగా వ్యవహరిస్తోంది


` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌


హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి):యూపీలోని లఖింపుర్‌ ఖేరి ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పీవీ మార్గ్‌లోని పీపుల్స్‌ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్నామని అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్‌లో రైతులపై జరిగిన దుర్మార్గాన్ని ఎందుకు ఖండిరచలేదని నిలదీశారు. మోదీ, కేసీఆర్‌ వేర్వేరు కాదు.. ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. 80 కోట్ల మంది రైతుల జీవితాల విూద మోదీ, అమిత్‌ షా మరణ శాసనం రాశారని ఆరోపించారు.‘‘దేశ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారు. రైతుల పట్ల భాజపా అమానుషంగా ప్రవర్తిస్తోంది. గాంధీ స్ఫూర్తితో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై భాజపా ఎంపీ కుమారుడు దారుణంగా ప్రవర్తించారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో మోదీ, యోగి విఫలమయ్యారు. రైతుల పక్షాన కాంగ్రెస్‌ అండగా ఉంటుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర పతి పాలన విధించాలి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలి. అజయ్‌మిశ్రాను మంత్రిపదవి నుంచి తొలగించాలి. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సహాయం చేస్తాం. ఉత్తర్‌ప్రదేశ్‌కి మా కమిటీ వెళ్లి సహాయం చేస్తుంది’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు వీహెచ్‌, సీతక్క తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.