సాహిత్యానికి చీకటి రోజు అన్న చిరంజీవి

నా ఎడమ భుజం కూడా పోయిందన్న విశ్వనాథ్‌

హైదరాబాద్‌,నవంబర్‌30(జనం సాక్షి):సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి ఇండస్ట్రీలో పెను విషాదాన్ని నింపింది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో మెగస్టార్‌ చిరంజీవి కిమ్స్‌ హాస్పిటల్‌కు
వెళ్లి.. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఈ రోజు సాహిత్యానికి చీకటి రోజన్నారు చిరంజీవి. ఈ సందర్బంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సిరివెన్నెలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని.. ఆయన వస్తాడు అనుకున్నాం.. కాని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటూ చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారు. ఇక సీతారామా శాస్త్రిని సిరివెన్నెలగా మార్చిన వ్యక్తి దర్శకుడు కే. విశ్వనాథ్‌. వారిద్దరి మధ్య ఎంతో గాఢ అనుబంధం ఉండేది. సిరివెన్నెలను తమ్ముడిగా భావిస్తారు విశ్వనాథ్‌. అలాంటిది సీతారామాశాస్త్రి మరణ వార్త విని తల్లడిల్లిపోయారు విశ్వనాథ్‌. సిరివెన్నెల మృతి తనకు తీరని లోటన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల మృతి నాకు తీరని లోటు. బాల సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నా కుడి భుజం పోయినట్లు అనిపించింది. సిరివెన్నెల మృతితో నా ఎడమ భుజం కోల్పోయిన భావన కలుగుతుంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు.. మాట్లాడలేకుండా ఉన్నాను. సిరివెన్నెల కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను‘ అంటూ విశ్వనాథ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.