సిరివెన్నెల అస్తమయం..

 


(జనం సాక్షి) : 

 వెండితెర సిరివెన్నెల కరిగిపోయింది. పాటకు వెన్నెల వెలుగు పోయింది. నిగ్గదీశి శంకరుడినే బూడిదిచ్చే వాడిని ఏమి అడిగేది అని కడిగేసిన కలం కాలగర్భంలో కలిసిపోయింది. అదోరకం సాహిత్యంతో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా పాటను నవ్యదారుల్లో నడిపించిన సీతారాముడు ఇక లేరు. సినిమా పాటకు సిరిమువ్వల గుసగుసలు వినిపించిన నవ వాగ్గేయుడు సెలవంటూ వెళ్ళిపోయారు. తెలుగు సినిమా పాటపై జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది అంటూ చెరగని ముద్ర వేసిన మహా రచయిత ఊపిరి ఆగిపోయింది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి 1955 మే 20న అనకాపల్లిలో జన్మించారు. సిరివెన్నెల అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి . సీ.వి యోగి, సుబ్బలక్ష్మి దంపుతుల కుమారుడు సిరివెన్నెల. ఆయన పదవ తరగతి వరకు అనకాపల్లిలో జన్మించి.. కాకినాడలో ఇంటర్, బీఏ పూర్తిచేశారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్‏లో ఎంఏ పూర్తిచేశారు. ఎంఏ చదువుతూండగానే 1985లో దర్శకుడు కె.విశ్వనాథ్ తెరకెక్కించిన “సిరివెన్నెల” సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరుతోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా సినీ రంగంలో స్థిరపడిపోయి 3000 పైగా పాటలు రచించారు. విధాత తలపున ప్రభవించినది… అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు చిరస్థానం సంపాదించి పెట్టింది. ఆరంగేట్రం సిరివెన్నెలలోని ప్రతి పాట అణిముత్యమే.

✤ ఆయన కలం నుంచి జాలువారిన అనేక పాటలలో బాగా ప్రసిద్ది చెందినవి ..
సిరివెన్నెల (1986)… విధాత తలపున ప్రభవించినది, చందమామ రావే, ఆది భిక్షువు వాడినేది కోరేదీ, ఈ గాలీ ఈ నేలా, మెరిసే తారలదే రూపం, ప్రకృతి కాంతకు పాటలు
లేడీస్‌ టైలర్‌ (1986)… గోపీలోలా, ఎక్కడ ఎక్కడ…
శృతిలయలు (1987)… తెలవారదేమో స్వామి
స్వయంకృషి (1987)… పారాహుషార్
రుద్రవీణ (1988)… నమ్మకు నమ్మకు ఈ రేయినీ, లలిత ప్రియ కమలం విరిసినదీ
కళ్లు (1988)… తెల్లారింది లెగండో
స్వర్ణకమలం (1988)… ఆకాశంలో ఆశల హరివిల్లూ , అందెల రవమిది
శివ (1990)… బోటని పాఠముంది
ఆదిత్య 369 (1991)… జాణవులే నెరజాణవులే
క్షణక్షణం (1991)… కో అంటే కోటి, జాము రాతిరి జాబిలమ్మా, అందనంత ఎత్తా తారాతీరం
ఆపద్భాంధవుడు (1992)… ఔరా, అమ్మక చెల్లా! బాపురే బ్రహ్మకు చెల్లా
గాయం (1993)… నిగ్గ దీసి అడుగు, స్వరాజ్యమవలేని
పవిత్రబంధం (1996)… అపురూపమైనదమ్మ ఆడజన్మ
గతేడాది వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రంలో సామజవరగమన పాట రచించారు

✤ అవార్డులు…
రుద్రవీణలోని “లలిత ప్రియ కమలం విరిసినదీ..” పాటకు జాతీయ అవార్డు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11 సార్లు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులు..
4 సార్లు ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు. అలాగే 2019లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు సిరివెన్నెల.