జిఎస్టీ పరిహారం చెల్లింపునకు కట్టుబడి ఉన్నాం

ఐదేళ్ల పాటుపరిహారం చెల్లిస్తామన్న నిర్మలా సీతారామన్‌

న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి): వస్తు, సేవల పన్ను జీఎస్‌టీ అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగే ఆదాయ నష్టానికి ఐదేళ్ళపాటు పరిహారం చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ చెప్పారు. ఈ పరివర్తన కాలంలో 2015`16ను ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకుని, ఆ సంవత్సరం ఆదాయంపై సంవత్సరానికి 14 శాతం రెవిన్యూ వృద్ధి ఉండే విధంగా రాష్టాల్ర రెవిన్యూను కాపాడతామని తెలిపారు. జీఎస్‌టీ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు నిర్మల సీతారామన్‌ లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. రాష్టాల్రకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఐదేళ్ళపాటు జీఎస్‌టీ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్న ఏమిటంటే, దేశంలోని ఏ రాష్ట్రమూ 14 శాతం రెవిన్యూ వృద్ధి రేటును సాధించలేదనే వాస్తవం ప్రభుత్వానికి తెలుసా? ఒకవేళ తెలిస్తే 2022 తర్వాత జీఎస్‌టీ నష్టపరిహారాన్ని చెల్లించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? ఎక్సయిజ్‌ సుంకం, సేవా పన్ను, విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) వంటివన్నీ జీఎస్‌టీలో కలిసిపోయాయి. ఈ విధానం 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి ఐదేళ్ళపాటు నష్టపరిహారం చెల్లించాలనే నిబంధన ప్రకారం ఈ గడువు 2022 జూన్‌తో ముగుస్తుంది.