మూడురాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడం హర్షణీయం
దళిత సిఎం హావిూని విస్మరించింది కేసిఆరే: కిషన్ రెడ్డి
హైదరాబాద్,నవంబర్22(జనం సాక్షి): ప్రజల మనోభావాల ప్రకారం రాజధానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటనపై స్పందించిన ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమన్నారు. ప్రజల అభీష్టం మేరకే ఏపీ బీజేపీ అమరావతి రాజధానికి మద్దతుగా నిర్ణయం తీసుకుందన్నారు. రైతుల మేలును దృష్టిలో పెట్టుకునే కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకుందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పి.. ఎందుకు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దళితులు ముఖ్యమంత్రిగా పనికిరారా అని క్వశ్చన్ చేశారు. హుజూరాబాద్ ఎన్నికలకు సభలతో హడావుడి చేసి.. ఫలితాల తర్వాత దాన్ని కనుమరుగు చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. కేంద్రం ధాన్యం కొనడం లేదంటూ కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని పేర్కొన్నారు. ఈ యాసంగతిపాటు వచ్చే యాసంగికీ కేంద్రమే బియ్యాన్ని కొంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని కొత్తగా కొంటోందా అని కేసీఆర్ అంటున్నారు. ఈ ఏడేండ్లు బియ్యం తానే కొంటున్నానని సీఎం చెబుతూ వచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేంద్రం కొననంటోందని అంటున్నారు. ఈ సమస్యను ఐదారేళ్ల నుంచి రాష్ట్రం దృష్టికి కేంద్రం తీసుకొచ్చింది. బాయిల్డ్ రైస్ తప్ప మిగతాది కొనమని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. బాయిల్డ్ రైస్ సప్లయ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు లేని సమస్యను ముఖ్యమంత్రి తెరవిూదకు తెచ్చారు. అసలు టీఆర్‌ఎస్ బాధేంటి? కేంద్ర మంత్రిగా ’రా రైస్’ కొంటామని నేనే చెప్పాను. ఇప్పుడే కాదు వచ్చే యాసంగికి కూడా కొంటాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతి గింజను కొంటామని స్పష్టం చేస్తున్నా. ఈ ఏడు సంవత్సరాలుగా మేం బియ్యం కొంటున్నమని టీఆర్‌ఎస్ నేతలు ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది.. బియ్యం కొంటోంది కేంద్రమేనని. ప్రతి క్వింటాల్ ధాన్యానికి కేంద్రం సబ్సిడీ ఇస్తోందని రైతులు అర్థం చేసుకోవాలి’ అని కిషన్ రెడ్డి చెప్పారు. ’ఢల్లీిలో జరిగిన రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తామంది. అందులో తప్పు లేదు. అయితే తెలంగాణలో గత ఏడున్నరేళ్లుగా ఎంతమంది అన్నదాతలు చనిపోయారు? వారి కుటుంబాలకు ఎందుకు ఆర్థిక సాయం అందించడం లేదో చెప్పాలి. అది విూ బాధ్యత కాదా? రాజకీయ జూదంలో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? విూ కారణంగా ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.