ఓటిఎస్‌ ద్వారా 52 లక్షల మంది పేదలకు లబ్ది

 విపక్షాలు, విషపత్రికల దుష్పచ్రారం నమ్మొద్దు: మంత్రి

ఓటిపి పేరుతో ప్రజలను వైసిపి వేధిస్తోందన్న తణుకు ఎమ్మెల్యే
ఏలూరు,డిసెంబర్‌20 (జనం సాక్షి ):  ఓటీఎస్‌ ద్వారా 52 లక్షల మంది పేదలకు లబ్ది చేకూరుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. 4 లక్షల కోట్ల ఆస్తిని పేదలకు సీఎం జగన్‌ అందిస్తున్నారన్నారు. ఓటీఎస్‌పై కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 4 వేల కోట్లు లబ్దిదారులు చెల్లించడం ద్వారా పేదలకు 10 వేల కోట్ల రుణ మాఫీ జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో రుణ భారంలో ఉన్న పేద వారికి రుణ విముక్తి కలిగించి ఓటీఎస్‌తో వారి ఇంటిపై సంపూర్ణ హక్కు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. 52 లక్షల మందికి సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తున్నారన్నారు. రుణం లేనివారి దగ్గర 10 రూపాయల నామమాత్రపు రుసుంతో రిజిస్టేష్రన్‌ పట్టా అందిస్తున్నామని శ్రీరంగనాథరాజు అన్నారు. ఇదిలావుంటే ఓటీఎస్‌ పేరుతో పేద ప్రజలపై వైసీపీ ప్రభుత్వ వేధింపులు తగదని, ఎప్పుడో నిర్మించుకున్న పేదల ఇళ్లకు అప్పుకట్టలని ప్రజలపై ఒత్తిడి చేయడం దారుణమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం ఎండీవో, మున్సిపల్‌ కమిషనర్‌కు ఓటీఎస్‌ని వెంటనే రద్దు చేసి పేదలకు న్యాయం చేయాలని కోరుతూ ఆరిమిల్లి రాధాకృష్ణ వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి మాట్లాడుతూ.. పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ఎన్టీఆర్‌ ఆందప్రదేశ్‌లో 1983లో మొదటిసారి పక్కాగృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అప్పటినుంచి ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేసిన పేదల ఇళ్ల నిర్మాణానికి వారి సహాయ సహకారాలు అందిస్తూనే వచ్చారన్నారు. ’ఒక్క చాన్స్‌ ప్లీజ్‌’ అని వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి మొదలు ఇప్పటి వరకు ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.ఇప్పుడు కొత్తగా సంపూర్ణ గృహహక్కు (క్షా) పేరుతో పేదల నుంచి 10వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు డబ్బులు వసూలు చేయటం తగదన్నారు. ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం 48వందల కోట్ల రూపాయలను లూటీ చేయడానికి తెరదీసిందని మండిపడ్డారు. పలు ప్రాంతాల్లో ఓటీఎస్‌ పథకానికి అంగీకరించకపోతే పెన్షన్లు, రేషనకార్డులు, ప్రభుత్వ పథకాలు కట్‌ చేస్తామని వలంటీర్లతో బెదిరించి మరీ పేదల దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా అప్పులిచ్చి మరీ ఓటీఎస్‌ వసూళ్లు చేస్తున్నారన్నారు. పేదలకు సంబంధించిన ఇళ్లను ఉచితంగా రిజిస్టేష్రన్‌ చేసి ఇవ్వాల్సిందిగా ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు.