రాష్ట్రంలో 91శాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణం

 
` సుప్రీంకోర్టు కమిటీ ఆన్‌ రోడ్‌ సేఫ్టీ ఛైర్మన్‌ జస్టిస్‌ అభయ్‌ మనోహర్‌ సప్రే వెల్లడి
హైదరాబాద్‌,డిసెంబరు 25(జనంసాక్షి): తెలంగాణలో 91శాతం రోడ్డు ప్రమాద మరణాలు అతివేగం కారణంగానే సంభవిస్తున్నాయని సుప్రీంకోర్టు కమిటీ ఆన్‌ రోడ్‌ సేఫ్టీ ఛైర్మన్‌ జస్టిస్‌ అభయ్‌ మనోహర్‌ సప్రే అన్నారు. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ పూర్తి స్థాయిలో ధరించడం, అతి వేగాన్ని నియంత్రించడం వంటి చర్యలు చేపడితే చాలా వరకు రోడ్డు ప్రమాదాల మరణాలు తగ్గుతాయన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద ఉన్న ఓ హోటల్‌లో జరిగిన రోడ్డు భద్రతా సమావేశానికి జస్టిస్‌ అభయ్‌ మనోహర్‌ సప్రే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.రవాణాశాఖ, జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, రైల్వే శాఖల ముఖ్య అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. బ్లాక్‌ స్పాట్‌ల సవరణ, ఔటర్‌ రింగ్‌రోడ్డుపై తీసుకుంటున్న చర్యలు, జీహెచ్‌ఎంసీ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలు, ట్రామా కేర్‌ సెంటర్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులు ఆయనకు వివరించారు. ఈ ఏడాది చైనా, జపాన్‌, జర్మనీ వంటి దేశాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగినా మరణాలు వేలల్లోనే ఉన్నాయని.. భారత్‌లో 1.5 లక్షల మంది చనిపోయారని కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ అభయ్‌ మనోహర్‌ తెలిపారు. 2021 వరకు తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో 6,690 మంది మరణించారని, రోడ్డు భద్రత పరిస్థితి మెరుగుపడాలని సూచించారు. ఓఆర్‌ఆర్‌ పరివాహక ప్రాంతాల్లో అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌లతో కూడిన ట్రామా కేర్‌ సెంటర్‌లను హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసింది. రవాణా శాఖ ఈ ఏడాది 10,728 డ్రైవింగ్‌ లైసెన్స్‌లను సస్పెండ్‌ చేశామని రవాణాశాఖ అధికారులు తెలిపారు. రోడ్‌ సేఫ్టీ కోసం రూ.25 కోట్లు కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు.