బిజెపిది రైతు వ్యతిరేక ప్రభుత్వం

 ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం

కేంద్రానికి టీఆర్‌ఎస్‌ ఎంపీల హెచ్చరిక

న్యూఢల్లీి,డిసెంబర్‌7  (జనంసాక్షి) : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు. మోదీ దిగిపోతేనే ఈ దేశ రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని తేల్చి చెప్పారు. ఇదే నినాదంతో ముందుకు వెళ్తామని ఎంపీలు స్పష్టం చేశారు. పార్లమెంట్‌ సమావేశాలను బాయ్‌కాట్‌ చేసిన తర్వాత ఢల్లీిలోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీ కే కేశవరావు,నామా నాగేశ్వరరావు లు విూడియాతో మాట్లాడారు. మోదీది ఫాసిస్ట్‌ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. ప్రజలను బీజేపీపై తిరుగు బాటు చేసేలా సమాయత్తం చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ఆందోళనలపై కేంద్రం స్పందించడం లేదన్నారు. చట్టసభను బాయ్‌కాట్‌ చేయడం బాధ కలిగించే విషయమే.. కానీ కేంద్రం తీరుకు నిరసనగానే బాయ్‌కాట్‌ చేస్తున్నామని ఎంపీ కేకే స్పష్టం చేశారు. సభను బాయ్‌కాట్‌ చేయాలని ఎవరూ కోరుకోరు అని ఆయన పేర్కొన్నారు. రబీలో పూర్తిగా ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుంది. వాతావరణ పరిస్థితుల వల్ల రబీలో రా రైస్‌ రాదు. రబీ ధాన్యం విరిగిపోయి నూకగా మారుతుంది. రబీ ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌గా మారుస్తాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వహిస్తోంది. తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని చెబుతున్నారు అని ఎంపీ కేకే పేర్కొన్నారు.