భవిష్యత్‌ ఉద్యమాలకు అన్నదాతల ప్రేరణ

ప్రజావ్యతిరేక నిర్ణయాలకు రైతు పోరాటం స్ఫూర్తి

ఉద్యమాలతో పాలకులకు చెక్‌ పెట్టక తప్పదు

న్యూఢల్లీి,డిసెంబర్‌11 (జనంసాక్షి) :  ఇటీవల కాలంలో నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా లక్షల మంది ప్రజలు సుదీర్ఘ కాలం సాగించిన ప్రజా పోరాటం అన్నదాతలదే అనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ సమాజం నుండి ఈ పోరాటానికి వెల్లువెత్తిన సంఫీుభావమే ఇందుకు నిదర్శనం. ప్రపంచ చరిత్రలో చిరస్మరణీయ ఉద్యమాల జాబితాల్లో ఢల్లీి అన్నదాతల ఉద్యమం నిలుస్తుంది. అందరికీ అన్నం పెట్టే చేయి అవసరమైతే ఉద్యమిస్తుందని ఢల్లీిలో రైతులు తమ సత్తా చాటారనడంలో సందేహం లేదు. దేశ చారిత్రక ఘట్టాల్లో రైతుల ఉద్యమం నిలుస్తుంది. ఢల్లీి పెద్దల మెడలొంచిన ఈ పోరాటం ఎన్నో విధాల ప్రత్యేకమైనది. సాగుచట్టాలతో అన్నదాతల జీవితాలను మరింత అతలాకుతలం చేస్తాయన్న విషయంలో రేగుతున్న చర్చ జరిగితే కనీసంగా  కూడా మోడీ ప్రభుత్వం స్పందించలేదు. ఈ చట్టాలు ఎలా మంచి చేస్తాయో చెప్పలేదు. ఈ బిల్లులను ఆమోదించిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఒక ప్రహసనంగా మార్చిందన డంలో ఏ మాత్రం సందేహం లేదు. ముందుతరం నేతలు బిజెపిలో ఆధిపత్యం చెలాయించి ఉంటే బహుశా ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సాహసించేవారు కాదేమో. బిల్లు ఆమోదించే క్రమంలో ఎన్డీఏలో భాగస్వామి అయిన అకాలీదళ్‌కు చెందిన మంత్రి రాజీనామా చేసిన తర్వాత కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. దాదాపు 18 పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని తెలిసినప్పటికీ పట్టించుకోలేదు. ఈ చట్టాలపై రాష్టాల్ర ముఖ్యమంత్రులతో మాట్లాడడం కానీ, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం కానీ చేయలేదు. ఒక బిల్లును ఏదో రకంగా, కనీస చర్చ లేకుండా, సభ్యుల మనోభావాలతో నిమిత్తం లేకుండా తాను అనుకున్న రోజే ఆమోదింప చేయాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకున్న తీరు కారనంగానే అన్నదాతలు రోడ్డెక్కాల్సి వచ్చిందని ఇప్పటికైనా గుర్తించి వెనక్కి తగ్గడం మంచిదే. ఈ బిల్లులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం దేశంలో రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న చిత్తశుద్ధిని ప్రదర్శించ లేదని తేలిపో యింది. కార్పేరేట్‌ రంగాన్ని సంతృప్తి పరిచి వారికి నూతనావకాశాలు కల్పించా లన్న సంకల్పమే కనిపించింది. తన వైఫల్యాల నుంచి చేతులు దులుపుకునే ప్రయత్నంలో భాగంగా మోడీ ఇప్పుడు రద్దుకు చర్యలు చేపట్టారనే చెప్పాలి. రైతులు సాధించిన అతిపెద్ద విజయంగా ఇది భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది. వారి పోరాటస్ఫూర్తి మున్ముందు ఉద్యమాలకు ప్రేరణ కానుంది. ఈ క్రమంలో పాలకుల నిరంకుశ విధానాలకు ప్రజలు చైతన్యం కావాలి. పోరాటస్ఫూర్తిని పొందాలి. కార్పొరేట్‌ కంపెనీ లకు వ్యవసాయాన్ని గంపగుత్తగా కట్టబెట్టే పన్నాగంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వినాశకర చట్టాలను, విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కనీస మద్దతు ధర కోసం చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ 2020 నవంబరు 26న ఢల్లీి సరిహద్దుల్లో ప్రారంభించిన అన్నదాతల ఆందోళనలు ఎట్టకేలకు ఫలించాయి. కష్టజీవు ల కష్టార్జితాన్ని కార్పొరేట్‌ బొక్కసాలకు దోచిపెట్టేసి అటు రైతుల హక్కులనే కాకుండా ఇటు ప్రజల ఆహార భద్రత హక్కును కూడా కాలరాయాలని చూసిన పాలకుల దుర్నీతిని ఎండగట్టిన  మహోజ్వల ఉద్యమాన్ని వీరోచితంగా సాగించిన అన్నదాతల చరిత్ర చిరస్థాయిగా నిలుస్తుంది. క్రమశిక్షణతో అత్యంత ప్రజాస్వామ్య యుత పద్ధతుల్లో హింసకు ఏమాత్రం తావు ఇవ్వకుండా ఈ ఉద్యమం సాగింది. ఈ పోరాటాన్ని అణిచి వేసేందుకు పాలకులు పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. అయినా రైతే గెలిచాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 పైబడి రైతు సంఘాలు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌.కె.ఎం) పేరిట ఒకే గొడుగు కిందకు రావడం అసాధారణమైన విషయంగా చూడాలి. వ్యవసాయ పనుల్లో సగానికి పైగా మహిళలే కావడం..ఈ  ఉద్యమంలోనూ వారే తమ శక్తిని చాటడం గమనించాలి.  పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా పోరు సల్పారు. భారత్‌ బంద్‌ సహా సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన అన్ని ఉద్యమ పిలుపుల్లోనూ సమస్త ప్రజానీకం భాగస్వాములై ప్రజాపోరాటంగా చాటాయి.  అదానీ, అంబానీ సంస్థల ఉత్పత్తులను బహిష్కరిం చాలని పిలుపునివ్వడం సామాన్యమైన విషయం కాదు. ఖలిస్తానీలు, మావోయిస్టులు, పాకిస్తాన్‌, చైనా ఉసిగొల్పితేనే రైతులు రంగంలోకి దిగారంటూ ప్రభుత్వ అనుకూల విూడియా దుమ్మెత్తి పోసినా కష్టజీవులు చలించలేదు. ఉద్యమిస్తున్న రైతులను మంత్రి కుమారుడు కాన్వారుతో తొక్కించి చంపేయడం వంటి ఎన్ని దారుణాలకు పాల్పడినా రైతే నిలిచి గెలిచాడు. భవిష్యత్‌ ఉద్యమాలకు..పాలకుల వ్యతిరేక విధానాలకు ఇది ఉత్తేజితం కాగలదు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ సర్కార్‌ అమరావతిపై ఆడుతున్న నాటకానికి కూడా ఈ ఉద్యమం తోడు కాగలదు. అమరావతి ఉద్యమాన్ని అణిచివేస్తామనుకుంటే అక్కడా బొక్కబోర్లా పడడం ఖాయం. ``````ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా మోడీ నిర్ణయాలుకార్పోరేట్లకు ఊడిగం చేసే యత్నాలకు పెద్దపీటప్రభుత్వాల తీరుపై మండిపడ్డ నారాయణవిజయవాడ,డిసెంబర్‌11(ఆర్‌ఎన్‌ఎ): ప్రజల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పాటుపడాలనే విషయంపై రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు స్పష్టతనిచ్చినా ... వాటి అమలులోపమే అసలు సమస్య అని సిపిఐ నేత నారాయణ అన్నారు. అనేకానేక సమస్యలను ప్రజల కోణంలోనే చూడాలన్నారు. అప్పుడే సమస్యలకు చెక్‌ పెట్టగలమన్నారు. కానీ పాలకలు ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేవలం కార్పోరేట్‌ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతోనే సమస్యలు వస్తున్నాయని నారాయణ ఆర్‌ఎన్‌ఎ ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. ఇటీవల రైతుల ఉద్యమాలతోనే సాగుచట్టాలను రద్దు చేశారని అన్నారు. అలాగే అమరావతికోసం రైతులు చేస్తున్న ఉద్యమాన్ని కూడా తక్కువ చేస్తే నష్టపోయేది జగన్‌ మాత్రమే అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు ఎందుకు అడ్డంకులు సృష్టించాలన్నారు. జగన్‌ కూడా పాదయాత్ర చేయలేదా అని అన్నారు. ఆనాడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకన్నారు. వైసిపి రాజధాని విషయంలో తప్పటడుగులు వేసిందన్నారు. ఇకపోతే రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఏడుదశాబ్దాల్లో పేదరికం పూర్తి స్థాయిలో తగ్గకపోవడం, అంతరాలు పెరిగిపోవడం అందోళనకరమైన విషయమే. కేంద్రంలో మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగ లక్ష్యాలకు భిన్నమైన పోకడలు పెరిగిపోతున్నాయి. దేశాన్ని సంఘటితంగా ఉంచుతున్న రాజ్యాంగ పునాదులైన ప్రజాస్వామ్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదంపైనే దాడులు, కుట్రలు జరుగుతున్నాయి. ఆదేశిక సూత్రాలకు భిన్నంగా సంక్షేమ రాజ్యం భావన నుండి కేంద్ర ప్రభుత్వం వేగంగా తప్పుకుంటూ, ప్రైవేటు పెట్టుబడిదారులు, బడా కార్పొరేట్‌లకు ఎర్ర తివాచీ పరిచి ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, దేశ సంపదను కట్టబెడుతున్నది. దీంతో ధనవంతులు మరింత సొమ్ముచేసుకొని ప్రపంచ కుబేరులవుతున్నారే తప్ప దేశంలో సమస్యలకు పరిష్కారం దక్కడం లేదు. బడా పారిశ్రామికవేత్తలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, నేర చరిత్ర కలిగిన వారు ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నూటికి 90 శాతం ఈ వర్గాలే. ప్రజాసేవకులు కనుమరుగవుతున్న దుస్థితి. అందుకే పాలకులు ప్రజలను చులకనగా చూస్తున్నారన్నారు. అంబేడ్కర్‌ ప్రసాదించిన రాజ్యాంగ లక్ష్యానికి  భిన్నంగా నేడు డబ్బు, మద్యం, చీరలు, ఇతరత్రా సామాన్లు  లాంటివి ఇచ్చి ఓటరును ప్రలోభాలకు గురిచేసి అర్ధబలం, అంగబలంతో అధికారంలోకి వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఉపాధి, జీవన ప్రమాణాలు పెంపొందించే చర్యలు చేపట్టకుండా చిన్నచిన్న సంక్షేమ పథకాలను ఎరవేస్తున్నారు. ఇలాంటి తరుణంలో నేటి ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తూ సంక్షేమ పథకాలు ఎరచూపి ప్రజలపైన పెత్తనం చేస్తూ పాలన సాగిస్తున్నారని అన్నారు. చమురు, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. మోడి ప్రభుత్వం విద్యుత్‌ చట్టంలో సవరణలు తీసుకొచ్చి ప్రజలను చీకట్లోకి నెట్టివేస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌, కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టి బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తున్నది. కార్పొరేట్‌ కంపెనీలు బ్యాంకులకు బకాయిపడ్డ వేల కోట్ల రూపాయలను మాఫీచేసి, మరోపక్క ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నది. దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయి. దేశ జనాభాలో ఒక్క శాతంగా ఉన్న శతకోటీశ్వర్ల సంపద 2009లో 11 శాతం ఉండగా, 2019 నాటికి 21 శాతానికి పెరిగింది. అత్యధిక పేదరికం భారతదేశంలోనే ఉండగా, మరోవైపు కుబేరుల సంఖ్య పెరిగిపోతున్నది. ఈ పరిస్థితులకు ప్రధాన కారణం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడమే. పేదరికాన్ని తగ్గించడంకన్నా ప్రపంచస్థాయి కోటేశ్వరులను తయారు చేయడానికి మోడీ ఎక్కువ మక్కువ చూపుతు న్నారనినారాయణ మండిపడ్డారు.  రైతుకు గిట్టుబాటు ధర అందడం లేదు. చేతివృత్తుల వారికి ఉపాధి కరువైంది. దేశం అప్పుల కుప్పగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పుల్లో కూరుకుని పోయాయి. ప్రభుత్వాలు అప్పులలో, ప్రజలు పేదరికంలో వుండటానికి ప్రధాన కారణం పాలకుల మోసపూరిత వాగ్దానాలకు అద్దం పడుతోంది. కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తోన్న ఈ ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తూ శ్రమదోపిడికి పాల్పడుతున్నాయని అన్నారు.  నేరచరితగల నాయకులు తాము చేసిన నేరాల నుండి బయటపడటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కార్పొరేట్‌ శక్తులు కీలుబొమ్మలుగా మార్చుకొని పెత్తనం చెలాయిస్తున్నాయని, దీనిని అరికట్టకుంటే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యం కాదన్నారు.