ఆన్‌లైన్‌లో అన్ని శాఖల ఆడిటింగ్‌


ఆడిటింగ్‌ శాఖ గౌరవం పెరగాలి

ఆడిట్‌ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సవిూక్ష 

హైదరాబాద్‌,డిసెంబర్‌7  (జనంసాక్షి) :   వందకు వంద శాతం అన్ని శాఖల ఆడిటింగ్‌ ఆన్‌లైన్‌లో జరిగే దిశగా అడుగులు వేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ ప్రారంభించాలన్నారు. ఆడిట్‌ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలని, ప్రతీ పైసా ప్రజలకు చేరడమే లక్ష్యంగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక శాఖ హెచ్‌వోడీలు, జిల్లా స్థాయి ఆర్థిక, ఆడిట్‌ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సవిూక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్‌ శాఖలో వంద శాతం ఆన్‌ లైన్‌ ఆడిటింగ్‌ చేసిన రాష్ట్రంగా తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రసంశలు పొందిన నేపథ్యంలో ఆ శాఖ వారందరికీ హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌తో పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పూర్తిస్థాయిలో రికవరీ, అభ్యంత రాలు పరిష్కారం చేసేలా అడుగులు వేయాలన్నారు. స్థానిక సంస్థలకు, ఇతర శాఖల నుండి వచ్చే అభ్యంతరాలకు సంబధించిన పేరాలను పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలో ఈ మూడు నెలల్లో 2400 అభ్యంతరాలను ఆడిట్‌ చేసి పరిష్కరించడం ద్వారా రూ. కోటి 26 లక్షల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ జిల్లా అదనపు కలెక్టర్‌ను, ఆడిట్‌ సిబ్బందిని హరీశ్‌రావు అభినందించారు. ఇదే రీతిలో అన్ని జిల్లాల్లో ఆడిట్‌ విూటింగ్స్‌ పెట్టి పూర్తిగా అభ్యంతరాలను పరిష్కరించాలి అని ఆదేశించారు. ఈ ఐదారు నెలల్లో ఆయా శాఖలకు సంబంధించి పూర్తిగా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ధనం వ్యర్థం కాకుండా సరైన రీతిలో వినియోగం అయ్యేలా చూడటమే ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌ ముఖ్య విధి అని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆయా శాఖలవారీగా ఎక్కడైనా నిధుల దుర్వినియోగం జరిందా? లేదా? అని పకడ్బందీగా ఆడిట్‌ నిర్వహించాలి. నిధుల దుర్వినియోగం జరిగితే ఆ సమాచారం శాఖల వారీగా తెప్పించాలి అని సూచించారు. జాయింట్‌ డైకర్టర్లు తరచూ క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆడిటింగ్‌ సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు రుణ మాఫీ సరిగా జరిగిందా? లేదా? పరిశీలన జరపాలి. బ్యాంకు వద్ద ఉన్న సమాచారం, సంబంధిత శాఖ వద్ద ఉన్న సమాచారం సరిపోల్చు కోవాలని చెప్పారు. అదే రీతిలో వడ్డీలేని రుణాలు, స్వయంసహాయక బృందాలకు రుణాలు సరిగా అందుతున్నాయా? లేదా? పరిశీలించాలన్నారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రతీ పైసా లబ్దిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.