గురుదాస్‌పూర్‌ సెక్టార్‌లో చొరబాట్లు


పాక్‌ చొరబాటుదారుడు హతం

చండీగఢ్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ సెక్టార్‌లో భారత్‌` పాక్‌ సరిహద్దలో బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో పాక్‌కు చెందిన చొరబాటు దారుడు హతమయ్యాడు. మంగళవారం ఉదయం 6.45 గంటల ప్రాంతంలో అక్రమంగా భారత భూభాగంలోకి చొరబడడంతో కాల్పులు జరిపారు. అలాగే ఆదివారం సరిహద్దుల్లో డ్రోన్‌ సైతం సంచరించడంతో సైనికులు కాల్పులు జరిపారు. 18వ బెటాలియన్‌కు చెందిన బీఓపీ కసోవాల్‌ సరిహద్దుల్లో పాక్‌కు చెందిన డ్రోన్‌ సంచరిస్తూ కనిపించగా.. సైనికులు డ్రోన్‌పై కాల్పులు జరిపారు. దట్టమైన పొగమంచు కప్పివేసిన సమయంలో డ్రోన్‌ ఎగురుతూ కనిపించడంతో సైన్యం కాల్పులు జరిపిందని బీఎస్‌ఎఫ్‌ డీఐజీ ప్రభాకర్‌ జోషి పేర్కొన్నారు. ఆ తర్వాత బీఎస్‌ఎఫ్‌, పంజాబ్‌ పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. అనుమానాస్పదంగా ఏవిూ దొరకలేదని పేర్కొన్నారు. సరిహద్దు వెంబడి డ్రోన్‌, ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే బీఎస్‌ఎఫ్‌ పోస్ట్‌కు సమాచారం ఇవ్వాలని, తద్వారా దేశ వ్యతిరేక శక్తులను ఎదుర్కొని.. అవాంచనీయ సంఘటనలు జరుగకుండా నిరోధించవచ్చంటూ స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.