ఒమిక్రాన్‌ ముప్పుతో మళ్లీ ఆంక్షలు దిశగా దేశం !

  ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి. ఇవన్నీ కూడా కేవలం విదేశాల నుంచి వచ్చిన వారిలో కనిపించినవే. ఇక వీరినుంచి వేగంగా ఇతరులకు వ్యాపించేందుకు మరెంతో సమయం లేదు. ఈక్రమంలో దేశంలో పండగలు, ఉత్సవాలు, వేడుకలపై మళ్లీ ఆంక్షలను ఆయా రాష్టాల్రు ప్రకటిస్తున్నాయి. డెల్టా వేరియంట్‌ విజృంభణ సమయంలో అప్రమత్తంగా ఉన్న ప్రజలు మళ్లీ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు జాగ్రత్తలు పాటించకుంటే ఒమిక్రాన్‌ రూపంలో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై ఢల్లీి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అలాగే కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాక్షిక ఆంక్షలు విధించాయి. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంక్షల విధించాలని సూచించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి రావచ్చు. ప్రభుత్వం ఆంక్షలు విధిం చిందన్న బాధతో కాకుండా ఇప్పుడు ఎవరికి వారు ఆంక్షలు విధించుకోవాలి. ఎందుకంటే విదేశాల నుంచి వస్తున్న వారిలో ఒమిక్రాన్‌ బయటపడుతోంది. దీనికి వ్యాప్తి ఎక్కువ కనుక జనసమూహాల్లో వేగంగా వృద్ది చెందగలదు. అందువల్ల మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మరోమారు నిత్యజీవితంలో తప్పనిసరి కావాలి. అయితే ఇది ఒక దేశంలో అడుగుపెట్టి డామినెంట్‌ వేరియంట్‌గా మారిన తర్వాత వచ్చే వేవ్‌ 3నెలల్లోపే ముగియనుందన్న వార్తలు వస్తున్నాయి. జాగ్రత్తలు పాటించకుంటే వచ్చే ఫిబ్రవరి వరకు మాత్రం విజృంభిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వేవ్‌ కొనసాగినంత కాలం మాత్రం సమస్య లు తప్పవంటున్నారు. సరైన చర్యలు తీసుకుంటే తప్ప వచ్చేయేడు కరోనాకు చరమగీతం పాడొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు తక్షణమే ప్రజలంతా కోవిడ్‌ టీకాలు తీసుకోవాలని వైద్యులు,నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులతో కరోనా సంక్షోభం అత్యంత తీవ్రదశకు దారి తీసే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోందని ఇప్పటికే గుర్తించారు. టీకా తీసుకున్న వారిలో కూడా ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో హాలీడే సీజన్‌లోకి అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండకపోవచ్చని, భవిష్యత్‌లో ఏదో ఒక రోజు ఈ మహమ్మారికి అంతం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాస్కు ఒక్కటే వ్యాప్తి నిరోధకమని అప్పటివరకు ఒకరికొకరు అండగా ఉండాలన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని భావించే సమయంలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైంది.ఒమిక్రాన్‌ అందరికీ సోకుతోందని, గుర్తించి మసలుకోవాలి. బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా మరింత రక్షణ పొందవచ్చని కూడా విదేశీ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్‌ మనపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో ఇంకా తెలియదని, ఈ విషయాల్లో స్పష్టత వచ్చేవరకు అంతా దీన్ని సీరియస్‌గానే తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. డెల్టాలో కనీసం సగం తీవ్రత దీనికున్నా దీని వేగంతో అత్యంత భీభత్సం సృష్టించగలదని హెచ్చరించారు. కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచంలోని అనేక దేశాలు రక్షణ కోసం బూస్టర్‌ డోస్‌లను ప్రిఫర్‌ చేస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో ఇప్పటికే నాలుగో డోస్‌ నడుస్తోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ బూస్టర్‌ డోస్‌ల ద్వారా విపత్తు నుంచి బయటపడలేరని హెచ్చరిస్తోంది. ఏ దేశం కూడా మహమ్మారి నుంచి బయటపడలేదని వివరించే ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఓమిక్రాన్‌ ప్రపంచంలోని 106 దేశాల్లో విస్తరించింది. అయితే కొన్ని

సంపన్న దేశాలకు అదనపు కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లను పంపడం సమంజసం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదిస్తోంది. ఇది అసమానతలను మరింత తీవ్రతరం చేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టుడ్రోస్‌ హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని చాలా పేదదేశాల్లో చాలా మంది బలహీన ప్రజలు ఇప్పటి వరకు ఒక్క డోస్‌ టీకాని కూడా పొందలేదు. అయితే సంపన్న దేశాలు మాత్రం పెద్ద ఎత్తున బూస్టర్‌ డోస్‌లంటూ హడావిడి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బూస్టర్‌ ప్రోగ్రామ్‌లు మహమ్మారిని అంతం చేయడంతో పాటు, ఇప్పటికే అధిక స్థాయిలో టీకాలు వాడిన దేశాలు వ్యాక్సిన్‌ను ఇతర పేద దేశాలకు అందించలేవని డైరెక్టర్‌ జనరల్‌ డ్రోస్‌ అధనామ్‌ అభిప్రాయపడ్డారు. దీని కారణంగా వైరస్‌ వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు ఏదేశం కూడా దారి చూపలేదన్నారు. కొత్త వేరియంట్‌ వేగంతో వ్యాప్తి చెందుతోందని ఇప్పటివరకు 106 దేశాల్లో దీనిని గుర్తించామని ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్‌ సెలవుల సందర్భంగా కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా కనీసం 126 దేశాలు ఇప్పటికే బూస్టర్‌ లేదా అదనపు వ్యాక్సిన్‌ మోతాదుల కోసం సిఫార్సులను జారీ చేశాయని, 120 దేశాలు ఈ కార్య క్రమాలను అమలు చేయడం ప్రారంభించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ తెలిపింది. మొత్తంగా ఇప్పుడు మనదేశంలో మెల్లగా ఇది విస్తరణదశకు చేరుకుంది. దీంతో ప్రతి ఒక్కరూ ముందు రెండు డోసుల వ్యాక్సిన తీసుకోవడంతో పాటు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. అలాగే మాస్కులు ధరిస్తూ వేడుకలకు దూరంగా ఉండాలని సూచిస్తోంది. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలను బహిరంగంగా చేసుకునే అవకాశం లేకుండా చూసుకోవాలన్నారు.