మహింద్రా సహకారంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌
2014 కంటే ముందు ఒక్క ఆక్సిజన్‌ సిలిండర్‌ మాత్రమే

ఆక్సిజన్‌తో కూడిన 560 పడకల జిల్లా దవాఖానగా అభివృద్ధి
ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడి
మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): మహీంద్రా కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంటును ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2014 కంటే ముందు ఒక్క ఆక్సిజన్‌ సిలిండర్‌ కూడా లేని పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఆక్సిజన్‌తో కూడిన 560 పడకల జిల్లా దవాఖానగా అభివృద్ధి పరిచామన్నారు. 2014 కంటే ముందు కేవలం 14 మంది వైద్యులు ఉండే వారు. కానీ ప్రస్తుతం వందల మంది సిబ్బందితో హాస్పిటల్‌లో నాణ్యమైన సేవలు అందుతున్నాయని స్పష్టం చేశారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌ తర్వాత మహబూబ్‌నగర్‌లో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మహీంద్రా లాంటి కంపెనీలు పాలమూరులో తమ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు స్థాపిస్తే 100 శాతం సహకరిస్తాం. ఇక్కడి యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికా రచన చేస్తున్నాం. అతి త్వరలోనే 400 కోట్ల వ్యయంతో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.