బ్రిగేడియర్‌ లిద్దర్‌కు రాజ్‌నాథ్‌ నివాళులు


అశ్రునయనాల మధ్య పూర్తయిన అంత్యక్రియలు

న్యూఢల్లీి,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  తమిళనాడు కూనూర్‌ లో చోటు చేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్దర్‌ కు ఆయన కుటుంబీకులు నివాళి అర్పించారు. భార్య, కూతురు లిద్దర్‌ భౌతిక కాయాన్ని కడసారి చూసి కన్నీరుమున్నీరయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ కూడా లిద్దర్‌ కు నివాళి అర్పించారు. లిద్దర్‌ సేవలకు గానూ ఆయన సెల్యూట్‌ చేశారు. ఢల్లీిలోని మిలిటరీ బేస్‌ హాస్పిటల్లో ఉన్న లిద్దర్‌ భౌతికకాయాన్ని బ్రార్‌ స్క్వేర్‌ వద్ద క్రిమటోరియంకు  తరలించారు. ఆయనతో పాటు.. నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ అజిత్‌ దోవల్‌ తోపాటు ఇతర అధికారులు కూడా నివాళులు అర్పించారు. అనంతరం లిద్దర్‌ కుటుంబ సభ్యులతో రాజ్‌ నాథ్‌ మాట్లాడి వారిని ఓదార్చారు. తర్వాత లిద్దర్‌ యూనిఫామ్‌, జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అందజేశారు అధికారులు. కన్నీరు పెట్టుకుంటూనే వాటిని అందుకున్నారు. బ్రిగేడియర్‌ లఖ్విందర్‌సింగ్‌ లిద్దర్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ ఉదయం లిద్దర్‌ భార్య గీతా లిద్దర్‌, కుమార్తె ఆస్నా లిద్దర్‌ అశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఢల్లీిలోని బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటికలో భావోద్వేగాలు, గుండెలను మెలిపెట్టే దృశ్యాల నడుమ బ్రిగేడియర్‌ లిద్దర్‌కు అంతిమ సంస్కారాలు చేశారు. లిద్దర్‌ చితికి నిప్పంటించడానికి కొన్ని నిమిషాల ముందు కనిపించిన దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. జాతీయ పతాకాన్ని పరిచి, పూలతో అలంకరించి ఉన్న లిద్దర్‌ శవపేటిక దగ్గరకు ఆయన భార్య గీతా లిద్దర్‌, కుమార్తె ఆస్నా లిద్దర్‌ చేరుకున్నారు. గీతా లిద్దర్‌ తన భర్త తలవైపున మోకాళ్లపై కూర్చుని శవపేటికపై ముద్దుపెట్టింది. అదే సమయంలో కుమార్తె ఆస్నా లిద్దర్‌ తన తండ్రి శవపేటికపై దోసిలతో రోజా పూలను విడుస్తూ వెక్కివెక్కి ఏడ్చింది. ఈ రెండు దృశ్యాలను చూసిన స్థానికులు దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించారు.