విశాఖ మన్యంలో పెరగిన చలి

 


మంచు దుప్పటిలో అరకులోయ
గోదావరి జిల్లాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు
విశాఖపట్టణం,డిసెంబర్‌24(జనం సాక్షి): విశాఖ మన్యంలో చలి తీవ్రత తగ్గడంలేదు. చలికితోడు మంచు దట్టంగా కమ్ముకుంటున్నది. ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు పాడేరు, చింతపల్లి, అరకులోయల్లో
మంచు దట్టంగా అలముకుంది. అలాగే ఏజెన్సీలోని జి.మాడుగుల, ముంచంగిపుట్టు, పాడేరు, హుకుంపేట ప్రాంతాల్లో వారం రోజులుగా సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రత నమోదవుతున్నది. చింతపల్లిలో 7.2డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జనవరి మొదటి వారం వరకు ఏజెన్సీ వ్యాప్తగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవు తాయని అధికారులు తెలిపారు. అరకులోయలో మంచు అందాలు పర్యాటకులను కనువిందు జేస్తున్నాయి. అరకు నుంచి విశాఖపట్నం వెళ్లే దారిలో కొత్తభల్లుగుడ లోయంతా మంచుతో నిండుకొని పాల సమద్రాన్ని తలపిస్తున్నది. సందర్శకులతో మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, చాపరాయి కిటకిటలాడిరది. దీంతో సందర్శకులు మంచు అందాలను ఆస్వాదిస్తున్నారు. మరోవైపు కోనసీమతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో గ్రామాల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వణుకుతున్నారు. దీనికితోడు పొగమంచు ఉండడంతో తెల్లవారు జామునే ఇళ్ల నుంచి రావాలంటే సంకోచిస్తున్నారు. పొగమంచుతో వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు, రైతు కూలీలు చలిల్లోనే వణుకుతూ పొలంబాట పడుతున్నారు. చలినుంచి విముక్తి పొందేందుకు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆస్తమా, నిమ్ము, జలుబు, దగ్గు, శ్వాసకోస వ్యాధులతో పాటు జ్వరాల బారిన పడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. వారం రోజులుగా పగలు కూడా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రతతో గ్రావిూణ వాసులు గజగజ వణికిపోతు న్నారు. మొన్నటివరకు 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, మూడు రోజులుగా 24 డిగ్రీలకు పడిపోయింది. మంచు సైతం కమ్మేస్తోంది. చలికి భయపడి సాయం త్రం 5 నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వెనుకాడుతున్నారు. గ్రామాల్లో ఉదయం, రాత్రుళ్లు చలిమంటలు కన్పిస్తున్నాయి. పెరిగిన చలితో ఉన్ని దుస్తులు, స్వెటర్ల దుకాణాల వద్ద కొనుగోలు దారులతో రద్దీ కన్పిస్తోంది.