బంగ్లాలో కాళీమాత ఆలయం పునర్నిర్మాణం


పూజలు చేసి ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్‌

ఢాకా,డిసెబర్‌17 (జనంసాక్షి):   పాకిస్థాన్‌ సైన్యం 1971 యుద్ధం సమయంలో ఢాకాలో ఉన్న రమ్నా కాళీ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు, ప్రధాన పూజారిని కూడా హత్యచేసింది. అయితే దాన్ని మళ్లీ
పునర్‌ నిర్మించారు. ఈ సందర్భంగా శుక్రవరాం ఆలయాన్ని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మళ్లీ ప్రారంభించారు. విక్టరీ డే సెలబ్రేషన్స్‌ కోసం బంగ్లాలో రామ్‌నాథ్‌ మూడు రోజుల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. 1971 యుద్ధం సమయంలో పాకిస్థాన్‌ ఆర్మీ సుమారు 250 మంది హిందువులను అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఆ తర్వాత ఆ ఆలయాన్ని నేలమట్టం చేసింది. పాకిస్థాన్‌ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌ సెర్చ్‌లైట్‌లో భాగంగా హిందువులను చంపేశారు. 600 ఏళ్ల క్రితం నాటి ఆలయంపై 1971 మార్చి 27లో పాక్‌ ఆర్మీ కాల్పులు జరిపింది. ఆ ఆలయంలో ఉన్న ప్రధాన పూజారిని కూడా హతమార్చారు. 2017లో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఈ ఆలయాన్ని ప్రాంతాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఇక్కడ రమ్నా ఆలయ పునర్‌ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. బంగ్లా విముక్తి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు తిరిగి ఆలయ పునర్నిర్మాణాన్నిప్రారంభించారు. పూజల్లో పాల్గొన్నారు.