బలవంతపు ఓటిఎస్‌ నిలిపివేయాలి

టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య డిమాండ్‌

రాజమండ్రి,డిసెంబర్‌11  (జనంసాక్షి) :  ఒన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఓ పెద్ద కుట్ర అని ఎవరూ డబ్బులు కట్టొద్దని ఎమ్మెల్యే, టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి  తెలిపారు. ఓటీఎస్‌లో రూ.10 వేలు కట్టి  రిజిస్టేష్రన్‌ చేసుకుంటే ఇల్లు ఉందని, పెన్షన్‌, రేషన్‌ కార్డు ఇతర సంక్షేమ పథకాలు అన్నీ రద్దు చేస్తారని తెలిపారు. ఓటీఎస్‌ స్వచ్ఛందం అంటున్న వారు అధికారులకు ఎందుకు టార్గెట్‌ ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, విూపేరు విూద భూమి ఉందంటూ పెన్షన్లు ఎత్తివేస్తున్నా రన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ద్వారా బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి హౌసింగ్‌ రుణాలు రద్దు చేస్తామని ప్రకటిస్తే, ఆయన తనయుడు జగన్‌ ఓటీఎస్‌ పేరుతో వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. రోజువారీ టార్గెట్లతో చిరుద్వోగులు ఇబ్బందిపడుతున్నారని, వసూళ్లను వెంటనే నిలిపి వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఓటీఎస్‌ పేరుతో నిరుపేదలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని అధికారపార్టీ నేతలకు ఎమ్మెల్యే సూచించారు.ఓటీఎస్‌ విషయంలో బలవంతం లేదని, ఎవరైనా బలవంతం చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని వైసిపి నేతలు చెప్పడం బూటకమని అన్నారు.