తెలంగాణలో ఒమైక్రాన్‌ కలకలం

 



మూడు కేసులను గుర్తించిన వైద్యారోగ్య శాఖ
విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమైక్రాన్‌
కోల్‌కతాకు వెళ్లిన మరో బాలుడిలోనూ పాజిటివ్‌
హైదరాబాద్‌,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   అంతా భయపడ్డట్లుగానే తెలంగాణలోకి ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రవేశించింది. ఎనని జాగ్రత్తలు తీసుకున్నా ..చాపకింద నీరులా రానే వచ్చింది. మొత్తం మూడు కేసులను గుర్తించారు. ఇద్దరు విదేశీయులు ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్దారించబడినట్లు తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌ రావు విూడియాకు వెల్లడిరచారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్దారించారు. కెన్యా జాతీయురాలి వయసు 24 ఏండ్లు కాగా, సోమాలియా దేశస్థుడి వయసు 23 ఏండ్లు అని పేర్కొన్నారు. 12వ తేదీనే వీరిద్దరి శాంపిల్స్‌ సేకరించి జీనోమ్‌ సీక్వెన్స్‌కు పంపామని, మంగళవారం రాత్రి ఫలితాలు వచ్చాయన్నారు. వీరిద్దరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ అని తేలిందన్నారు. కెన్యా జాతీయురాలిని టిమ్స్‌కు తరలించాం. సోమాలియా దేశస్థుడిని ట్రేస్‌ చేస్తున్నట్లు వెల్లడిరచారు. అయితే ఈ ఇద్దరూ కూడా మెహిదీపట్నం, టోలీచౌకీలో ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులకు కూడా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించామన్నారు. ఇక మూడో వ్యక్తికి కూడా ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్దారించబడ్డాడు. అతని వయసు ఏడేండ్లు మాత్రమే. ఈ బాలుడి పశ్చిమ బెంగాల్‌కు చెందిన వాడు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే కోల్‌కతాకు వెళ్లాడని, రాష్ట్రంలోకి ప్రవేశించలేదని శ్రీనివాస్‌ రావు స్పష్టం చేశారు.వీరిలో ఒకరు కెన్యా నుంచి, మరొకరు సోమాలియా నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిద్దరూ కూడా నాన్‌ రిస్క్‌ కంట్రీస్‌ నుంచి రావడం గమనార్హం. మరో కేసుకు సంబంధించి 7 ఏళ్ల బాలుడికి కరోనా నిర్దారణ అయినప్పటికీ.. అతను బెంగాల్‌ వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ బాలుడు విదేశాల నుంచి వచ్చి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగి.. అక్కడి నుంచి డొమెస్టిక్‌ ఫ్లైట్‌లో కోల్‌కల్‌ వెళ్లినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కెన్యా నుంచి వచ్చిన 24 ఏళ్ల బాధితురాలికి గచ్చిబౌలి టిమ్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. సోమాలియా నుంచి వచ్చిన అబ్బాయికి కూడా ఒమిక్రాన్‌ గుర్తించారు గానీ.. అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియడంలేదు. అతని కోసం వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది గాలిస్తున్నారు. వీరిద్దరూ ఆయా దేశస్థలే తప్ప.. మనవాళ్లు కాదు. రాష్ట్రంలో ఎవరికీ కరోనా సోకలేదు. తెలంగాణలో ప్రస్తుతానికి రెండు యాక్టివ్‌ ఒమిక్రాన్‌ కేసులు ఉన్నాయి. ఇదే విషయాన్ని ధృవీకరించారు వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌. దీంతో అన్ని జిల్లాల వైద్యాధికారులను ప్రభుత్వం అలెర్ట్‌ చేసింది. పాజిటివ్‌ అని తేలినవారి కాంటాక్ట్స్‌ను ఐసోలేషన్‌కు తరలించారు.