అసంఘటిత రంగంలో బలమైన చట్టాలు రావాలి

ప్రస్తుత చట్టాల్లో మార్పులు రావాలంటున్న నిపుణులు

హైదరాబాద్‌,డిసెంబర్‌8(జనం సాక్షి):  అసంఘటిత కార్మికులకు సమగ్ర ప్రయోజనాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు సూచిస్తున్నారు. అందుకువీలుగా ప్రస్తుత చట్టాల్లో సంస్కరణలు తేవాల్సి ఉందన్నారు. అలాగే చట్టాలను కఠినంగా అమలు చేస్తేనే వీరికి ప్రయోజనం
కలుగుతుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, యజమా న్యాలను. లబ్ధిదారులను ఇందులో భాగస్వాములను చేయాలని కోరుతున్నారు. 2004లో అసంఘటిత కార్మికుల కమిషన్‌ ఏర్పాటైనా, అది మొక్కుబడిగానే మిగిలింది. కార్మికులందరిని ప్రభుత్వపరంగా నమోదు చేసి, అన్ని పథకాల పరిధిలో చేర్చాలి. దేశంలోని 39 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల్లో కేవలం తొమ్మిది కోట్ల మందే వివిధ పథకాల కింద నమోదై ఉన్నారు.
అందరికీ అన్ని ప్రయోజనాలు చేకూర్చడం వల్ల వారితో పాటు దేశానికీ మేలు జరుగుతుంది. అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి పని భద్రత కల్పించాలి. కనీస వేతనాలు కచ్చితంగా అందేలా చూడాలి. సామాజిక భద్రత కింద పింఛన్‌, పిల్లలకు విద్యాసదుపాయం ఉపకార వేతనాలను మంజూరు చేయాలి. వివాహ సమయాల్లో సాయం అందించాలి. మహిళా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య బీమా పథకాన్ని కార్మికులందరికీ విస్తరించాలి. సార్వత్రిక సంఖ్యతో వారికి స్మార్ట్‌కార్డులు అందుబాటులోకి రావాల్సిఉంది. వేతనాలు బ్యాంకు ద్వారా చెల్లించే ఏర్పాట్లు చేయాలి. అసంఘటిత రంగ కార్మికులు నేరుగా వేతనాలు పొందలేని పరిస్థితి ఏర్పడిరది. బ్యాంకు ఖాతాలు లేకపోవడం సమస్యగా
మారింది. వారందరి పేర్లు నమోదై, నగదు రహిత సేవలు అందుబాటులో ఉంటే ఎలాంటి సమస్యలు ఉండేవి కావు. కొత్తగా పనులు పొందడానికి వారు ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిని కేందప్రభుత్వం గుర్తించి, వారికోసం పెద్దయెత్తున బ్యాంకు ఖాతాల నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల తరఫున జిల్లా కలెక్టర్లు, ప్రధాన బ్యాంకు మేనేజర్లు, కార్మిక శాఖ అధికారులు ఇందులో పాల్గొని కార్మికులను చైతన్యపరచాలి. కేవలం మొక్కుబడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా కార్మికహితం కోసం దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఎలాంటి ఆంక్షలు లేకుండా వారందరికీ బ్యాంకు ఖాతాలివ్వాలి. అవసరమైతే ఇంటింటికీ తిరగాలి. బ్యాంకు ఖాతాలతో పాటు వారి సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాలి. ఇందుకోసం బలమైన వ్యవస్థను రూపొందించాలని కోరుతున్నారు.