తిరుమల శ్రీవారికి వెలకడతారా ?

సేవల పేరుతో వ్యాపారం చేస్తారా

శ్రీనివాసానంద సరస్వతీ స్వామి ఆగ్రహం
విశాఖపట్నం,డిసెంబర్‌20(జనం సాక్షి ): తిరుమల శ్రీవారి సేవల పేరుతో వేంకటేశ్వరుడిని నడిబజారులో పెట్టి అమ్ముతున్నారని ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి సేవలను అమ్ముతూ అభివృద్ది కోసమే అని చెప్పడం దారుణమని అన్నారు. టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని..ఎవర్ని అడిగి టికెట్ల పెంచుతున్నారని ప్రశ్నించారు. స్వామి దర్శనం కోసం టికెట్స్‌ ధర కోటి, కోటిన్నర రూపాయల ధర నిర్ణయించడం ఏమిటని నిలదీశారు. డబ్బులు ఉన్నవారికే.. వెంకటేశ్వరస్వామి దర్శనాలా... వెంకటేశ్వర స్వామిని కూడా ధనవంతులకు తాకట్టు పెట్టేస్తారేమో? అంటూ మండిపడ్డారు. భక్తులకు దేవుడ్ని దూరం చేయడమే టీటీడీ బోర్డు అనాలోచిత నిర్ణయమని అన్నారు. దేవుడితో టీటీడీ బోర్డు వ్యాపారాలు చేయడం దారుణమన్నారు. టీటీడీ జంబో బోర్డు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని గతంలో చెప్పామని ఇప్పుడు అదే జరుగుతోందని తెలిపారు. అనాలోచిత నిర్ణయాలు వెనక్కి తీసుకోక పోతే టీటీడీ పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వెంకటేశ్వర స్వామి సేవలో సుబ్బారెడ్డి ఉంటే...ఆయన సతీమణి బైబిల్‌ పట్టుకుంటారన్నారు. టీటీడీ తప్పుడు నిర్ణయాలు వెనక్కి తీసుకోక పోతే హిందూ సమాజం తిరగబడు
తుందని అన్నారు. జగన్‌ కైస్త్రవ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు దరిద్రగొట్టు వాళ్ళు రావడంతో... వెంకటేశ్వర స్వామి భారీ వర్షాలతో సంప్రోక్షణ చేసుకున్నారని శ్రీనివాసానంద సరస్వతి స్వామి విమర్శలు గుప్పించారు. ఇదిలావుంటే శ్రీవారి సేవా టికెట్లతో టీటీడీ వ్యాపారం చేయడం శోచనీయమని రాయలసీమ పోరాట సమితి నాయకుడు నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..భక్తుల విశ్వాసాన్ని ఆదాయ మార్గాలుగా మార్చవద్దని హితవు పలికారు. ఉదయస్తమాన సేవా టికెట్‌ ధర పెంపుపై టీటీడీ పునరాలోచించాలని డిమాండ్‌ చేశారు. టికెట్‌ ధర పెంపుతో పేదలు స్వామి సేవలో పాల్గొనే అవకాశం కోల్పోతారని నవీన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.