అకాల వర్షాలతో తగ్గిన వరి దిగుబడులు

పెట్టుబడి కూడా రాలేదంటున్న రైతులు

కర్నూలు,డిసెంబర్‌24(జనం సాక్షి): ఇటీవలి అకాల వర్షాలతో జిల్లాలో వరిదిగుబడి బాగా తగ్గింది. పలు మండలాల్లో వరి బాగా దెబ్బతింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన వరిపంట దిగుబడి భారీగా తగ్గింది. ఎకరానికి కనీసం 20 బస్తాల దిగుబడి కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. వరిపంట పెరిగి కోతదశకు చేరుకున్న తరుణంలో అకాల వర్షాలతో పంట నేలరాలిపోయి నష్టం వాటిల్లింది. ఎకరానికి పెట్టుబడులే భారీగా అయ్యాయని, ఆ పెట్టుబడులు సైతం దక్కే పరిస్థితి లేదని వరి రైతులు కలత చెందుతున్నారు. హార్వెస్టర్ల ఖర్చులు సైతం తడిసి మోపెడయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంజాముల మండల వ్యాప్తంగా ఎనిమిది వేల హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు. నాట్లు మొదలుకొని వేల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల కోసం భారీగా ఖర్చు చేసినా పంట దిగుబడి దక్కకపోవడంతో నష్టాల బారిన పడినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా ఎకరాకు 40 బస్తాల దిగుబడి వచ్చేది. ఈ ఏడాది సగానికి సగం దిగుబడి పడిపోయిందని రైతులు పేర్కొంటున్నారు. అకాల వర్షాలు దెబ్బతీయడంతోపాటు పండని పంటకు అధిక ఖర్చులు అన్న చందంగా వరికోతలకు భారీగా వెచ్చించాల్సి వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.